రోలుగుంట: మాదిగ కులానికి చెందిన తమకు ఓసీ కుల ధ్రువపత్రాన్ని ఇవ్వడం వల్ల గృహ విద్యుత్ లైన్ కట్ చేశారని బాధితులు ఎత్తుల ముత్యాలు, అర్జున, లోవరాజు వాపోయారు. రెండో దఫా దరఖాస్తు చేసుకుంటే ఎస్సీ – సీ (మాల) సర్టిఫికెట్ ఇచ్చారని, దీన్ని సరి చేయకుంటే ఈ నెల 16వ తేదీన సీపీఎం ఆధ్వర్యంలో అందోళనకు దిగుతామని హెచ్చరించారు. శనివారం వారు విలేకరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. రోలుగుంటకు చెందిన తాము ఆరు మాసాల క్రితం మాదిగ కులం ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, తహసీల్దార్ కార్యాలయం నుంచి ఓసీ ధ్రువపత్రం జారీ అయిందన్నారు. దీని ఆధారంగా తమ ఇంటి విద్యుత్ మీటరు లైనును అధికారులు కట్ చేశారన్నారు. మరలా రెండో దఫా కుల ధ్రువీకరణ సరిచేసి ఇవ్వాలని దరఖాస్తు చేయగా, ఎస్సీ– సీ(మాల) సర్టిఫికెట్ ఇచ్చారని వాపోయారు. ఈ సమస్యపై పీజీఆర్‌ఎస్‌లో మార్చి 17న ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు విచారణ చేసి మాదిగ కులంగా ధ్రువీకరించి జేసీకి నివేదిక పంపించి ఆరు మాసాలవుతుందని తెలిపారు. అప్పటి నుంచి కాళ్లరిగేలా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా కలెక్టరేట్ నుంచి ఆదేశాలు రాలేదని చెబుతున్నారని వాపోయారు. తమ పిల్లల చదువులతోపాటు రాయితీలు వర్తించక ఇక్కట్లు పడుతున్నామన్నారు. అధికారులు తప్పు సరిచేయకుంటే తహసీల్దారు కార్యాలయం వద్ద కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట కమిటీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె.గోవిందరావు, ఇ. చిరంజీవి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
దాని ఆధారంగా గృహ విద్యుత్ లైన్ కట్ చేశారని ఆవేదన


