● జేసీ తిరుమణి శ్రీపూజ
చింతపల్లి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో అత్యుత్తమ ఉపాధి అవకాశాలు లభిస్తాయని జాయింట్ కలెక్టర్ శ్రీమణి పూజ తెలిపారు. గురువారం స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్‌లోలో నిర్వహిస్తున్న ఆరోహణ్’ ఏఐ శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైటీసీలో విద్యార్థులకు అందుతున్న బోధన, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లతో పాటు శిక్షణ తీరుతెన్నులను జేసీ స్వయంగా పరిశీలించారు. క్లాసుల నిర్వహణ, భోజన వసతి, ఇతర వసతులపై విద్యార్థులతో నేరుగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిక్షణలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికతను విద్యార్థులు సమర్థవంతంగా నేర్చుకుని, భవిష్యత్తులో లభించే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా మెరుగైన, నాణ్యమైన శిక్షణ అందించాలని ట్రైనర్లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ త్రివేణి, ఆర్‌ఐ కృష్ణమూర్తి, ‘ఆరోహణ్’ సంస్థ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.


