తుమ్మపాల : ఇటీవల తీవ్ర ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరైన నియోజకవర్గ ప్రజలకు గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షం ఎంతో ఊరటనిచ్చింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం దంచికొట్టడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ వేసవిని తలపించేలా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించింది. కొంతకాలంగా ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరగడం, మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు మరింత అధికం కావడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. రాత్రివేళల్లోనూ ఉక్కపోత కారణంగా సరిగా నిద్రపట్టని పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో సాధారణంగా ఉండాల్సిన చల్లని వాతావరణానికి భిన్నంగా ఎండలు మండుతుండడంతో ప్రజలు వర్షం కోసం ఎదురుచూశారు.
నేల తడవడంతో రైతుల్లో ఆనందం
అనకాపల్లి పట్టణంతో పాటు మండలం, కశింకోట మండలాల్లో పలు గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో పొలాలు, ఖాళీ ప్రదేశాలు తడిశాయి. ఇప్పటికే వర్షాల కోసం ఎదురు చూస్తున్న పలు ప్రాంతాల్లో ఈ వర్షం రైతులకు ఆశలు కలిగించింది. ఎండ తీవ్రత వల్ల పశువులు ఇబ్బందులు పడుతున్న సమయంలో వర్షం కురవడం ఉపశమనాన్ని కలిగించిందని పాడి రైతులు చెబుతున్నారు. వర్షానికి ముందు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై బలమైన గాలులు వీచాయి. అనంతరం ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. కొద్దిసేపు దంచికొట్టిన వర్షంతో రహదారులు, పంట పొలాలు తడిసిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు నెమ్మదిగా రాకపోకలు సాగించారు.
చోడవరంలో భారీ వర్షం
చోడవరం: వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు కాస్త ఊరట లభించింది. వరి నాట్లు వేసిన తర్వాత సరైన వానలు పడక నీరు లేక రైతులు అల్లాడుతున్న సమయంలో గురువారం కురిసిన వర్షం రైతులకు చాలా మేలు చేసింది. చోడవరం పరిసర ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్ అంతా సరైన వర్షాలు పడలేదు. ఎండా కాలాన్ని తలపిస్తూ ఎండలు మండిపోవడం, కనీస వర్షపాతం కూడా కురవకపోవడంతో 40 శాతానికి మించి ఎక్కడా వరి నాట్లు వేయలేదు. నాట్లు వేసిన పొలాలకు నీరు లేక అవి కూడా ఎండిపోతున్నాయి. ఒక దుక్కు వర్షమైనా పడితే తప్పా వరి నాట్లు బతకవని ఆకాశం వైపు ఎదురు చూస్తున్న రైతన్నలకు ఇప్పుడు కురిసిన వవర్షం చాలా మేలు చేసింది. మరో పక్క వర్షం పడితే నాట్లు వేద్దామని ఎదురు చూస్తున్న బీడుగా ఉన్న భూములకు కూడా ఈ వర్షం చాలా ఉపయోగకరంగా మారింది. చోడవరం పరిసరాల్లో 20 నుంచి 25 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరితోపాటు అన్ని పంటలకు చాలా మేలు జరిగింది. మరోపక్క ఇప్పటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో వేడిక్కిపోయిన వాతావరణంతో అల్లాడుతున్న జనానికి కూడా ఈ వర్షం చాలా చల్లదనాన్ని ఇచ్చింది. రోడ్లన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. అపరాలు, కూరగాయల పంటలకు ఈ వర్షం చాలా మేలు చేసింది. మెట్ల ప్రాంతాల్లో దమ్ముపట్టేందుకు సిద్ధంగా ఉన్న పొలాలకు మరింత భారీ వర్షం కావాలని రైతులు చెబుతున్నారు.


