హాజరైన గ్రామస్తులు, మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, పాల్గొన్న నర్సీపట్నం ఆర్‌డీవో వి.వి.రమణ, ఎన్విరాన్‌మెంట్ డీటీ ముకుందరావు
మాడుగుల : వొమ్మలి జగన్నాథపురం గ్రామంలో ఆర్నా గ్రానైట్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నర్సీపట్నం ఆర్‌డీవో వి.వి.రమణ, ఎన్విరాన్‌మెంట్ ఈఈ ముకుందరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా 23 మందితో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారు. వీజేపురం గ్రామానికి చెందిన జయరామ్, శామంతుల అచ్చిబాబు, తాడి వెంకటరమణ, మజ్జి శంకరరావు, మాట్లాడుతూ మండలంలో వెనుకబడిన వీజేపురం గ్రామానికి ఆర్న గ్రానైట్ వల్ల నష్టం లేదని, గ్రామానికి చెందిన నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించాలని, గ్రామాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నారని, ధూళి రాకుండా ఉదయం, సాయంకాలం వాటరింగ్ చేస్తున్నారని, మా గ్రామానికి క్వారీల నిర్వహణ వల్ల ఎటువంటి నష్టం లేదని చెప్పారు. రావికమతం గుమ్మాళ్లపాడు గ్రామానికి చెందిన బంటు శ్రీనివాసరావు మాట్లాడుతూ క్వారీ నిర్వాహణ వల్ల పర్యావరణానికి నష్టం జరగకుండా మొక్కలు నాటాలని, భారీ క్వారీ లారీల వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, వాటి బరువుకు తగిన రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. క్వారీ వల్ల నష్టం కలిగే రైతులకు ఉపాధి చూపించాలన్నారు. సీపీఎం గోవిందరావు మాట్లాడుతూ ఉరలోవకొండపై ఆధారపడి 300 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని వారికి నష్టం జరగకుండా క్వారీ యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు మాట్లాడుతూ గ్రానైట్ క్వారీల వల్ల వచ్చే డీఎంఎఫ్ నిధుల్లో గణనీయమైన భాగాన్ని ప్రభావిత గ్రామాల మౌలిక సదుపాయాలకు కేటాయించాలని, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి నిబంధనలు పాటించాలని అన్నారు. తహసీల్దార్ రమాదేవి, డీటీ రాజా, ఎస్‌ఐ జి.నారాయణరావుతో సిబ్బంది, వీజేపురం గ్రామస్తులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


