చింతపల్లి: మండలంలో కుంకుమపువ్వు సాగు చేపట్టేందుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీమణి పూజ తెలిపారు. బుధవారం చౌడుపల్లి పంచాయతీ పరిధిలోని ధనంజయవీధి, చెరువూరు, కొత్తవీధి గ్రామాలలో ఈ ప్రాజెక్టుకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ధనంజయవీధిలో గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చింతపల్లి మండలంలో చేపడుతున్న కుంకుమపువ్వు ప్రాజెక్టుకు సంబంధించి స్థల పరిశీలన జరుపుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఎంతోకాలంగా గిరిజనుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని 23 మంది గిరిజన రైతుల నుంచి దాదాపు 50 ఎకరాలు స్వాధీనం చేసుకోవడం జరుగుతోందన్నారు. ప్రభుత్వ భూమిని తాత్కాలికంగా గిరిజనులు సాగు చేసుకుంటున్నప్పటికీ, ప్రభుత్వ అవసరాల నిమిత్తం దానిని తిరిగి తీసుకోవడం జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎంతోమంది గిరిజన రైతులకు, యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. ఇది ప్రారంభమైతే జిల్లా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. మన్యంలో వాతావరణం ఇప్పటికే ఎన్నో విదేశీ పంటల సాగుకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో, ఈ కుంకుమపువ్వు ప్రాజెక్టును కూడా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనుందని తెలిపారు.అనంతరం స్థానిక యూత్ ట్రైనింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హనుమంతు త్రివేణి, ఆర్‌ఐ కృష్ణమూర్తి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


