● ఎంవీఐ సాయి రమేష్
అవగాహన కల్పిస్తున్న మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సాయి రమేష్
పాడేరు: రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, వాటి నివారణకు రోడ్డు భద్రతా నియమాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని పాడేరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సాయి రమేష్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ’పీఎం రహవీర్’ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించి, వారిని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడే వారికి రూ.25 వేల ప్రోత్సాహకం అందుతుందని తెలిపారు. అలాగే ’పీఎం రాహత్’ పథకం కింద ప్రమాద బాధితులకు రూ.2.50 లక్షల వరకు వైద్య చికిత్స ఖర్చులు అందుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నియమాలను తప్పక పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సత్యనారాయణ, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ గౌరీశంకర్, విద్యార్థులు పాల్గొన్నారు.


