రోలుగుంట : జిల్లాలో 55 వేల హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా సుమారు 5 వేల హెక్లార్లలో కూడా సాగు కాలేదని, తీవ్ర వర్షాభావంతో జిల్లా రైతులను కరువు వేధిస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మండల కార్యాలయాల కూడలి సమీపంలో బుధవారం వైఎస్సార్‌సీపీ మండలస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త, పశ్చిమ గోదావరి జిల్లా కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్‌నాథ్. పీఏసీ సభ్యులు, పార్టీ మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ‘ఎల్‌నినోతో వర్షాలు కురవవు, వ్యవసాయం మానేయండి...అని రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం సరికాదని నాయకులు మండిపడ్డారు. పెట్టుబడులు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, నష్టపోయిన పెట్టుబడి పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
రైతులకు రూ.30 కోట్ల బకాయిలు..
18 నెలలుగా గోవాడ చెరకు రైతులకు సుమారు 30 కోట్ల రూపాయలు, ఉద్యోగుల జీత భత్యాలకు రూ.5 కోట్లు వెరసి రూ.35 కోట్లు బకాయిలున్నాయన్నారు. వీటిని ఈ నెల 21లోపు బాధితులకు చెల్లించాలని, అలాగే ప్రతి ఏడాది గోవాడలో రైతులతో నిర్వహించే సభ నిర్వహించాలని ప్రభుత్వానికి మన పార్టీ తరపున అల్టిమేటం పంపించామన్నారు. గడువులోపే చెల్లించకుంటే తమ పార్టీ రంగంలోకి దిగి వారికి బాకీ జమ చేయించే బాధ్యత తీసుకుంటుందని, చెరకు రైతుల సమావేశాన్ని కూడా ఈ నెలాఖరున నిర్వహించడం జరుగుతుందన్నారు.
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవుతుందని అందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇలా ప్రతి చోటా పోటీ చేయాలన్నారు. యుద్ధంలోకి వెళ్లాల్సిందే..యుద్ధం చేయాల్సిందే...విజయం సాధించాల్సిందేనని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అధికార పార్టీకి పోలీసులు బలం అయితే...ప్రజలు, కార్యకర్తలే మనకు బలం అని అభివర్ణించారు. కార్యక్రమంలో నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్, చోడవరం నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడు గండి రవి, జెడ్పీటీసీ పోతల లక్ష్మీ, ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు టి.వి.రమణ మాట్లాడారు. మాజీ ఎంపీపీ శెట్టి సత్యనారాయణమూర్తి, నాయకులు పోతల లక్ష్మీ శ్రీనివాస్, చెట్టుపల్లి వెంకట్రావు, మడ్డు అప్పలనాయుడు, చెటికెల వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. సమావేశం అనంతరం పదవీ విరమణ చేసిన సర్పంచ్‌లు, పదవి ముగియనున్న ఎంపీటీసీలు, పోటీ చేసి ఓటమి చెందిన సర్పంచ్, ఎంపీటీసీలను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో నాయకులు ఘనంగా సత్కరించారు.
గడువు దాటితే వైఎస్సార్‌సీపీపోరాటం ఉధృతం
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ,
జిల్లా పార్టీ అధ్యక్షుడుబొడ్డేడ ప్రసాద్ వెల్లడి


