చోడవరం : విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (పీడీఎస్‌ఓ) ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ చేశారు. చోడవరం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా కొత్తూరు జంక్షన్ వద్దరూ అన్ని కాలేజీల విద్యార్థులు కలిసి భారీ ర్యాలీ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్ రామారావుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్ షిప్స్ బకాయిలు రూ.7వేల కోట్లు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌వో, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, ఫీజులు కట్టకపోతే పరీక్షల హాల్ టిక్కెట్లు ఇవ్వమని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో పూర్తి స్థాయి సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, చోడవరం ఏబీసీడబ్ల్యూ పరిధిలో 15 బీసీ హాస్టళ్లు ఉంటే వీటిలో 10 హాస్టళ్లకు పూర్తిస్థాయి వార్డెన్లు లేరని విద్యార్థులు తెలిపారు. మెస్ ఛార్జీలు రూ. 3వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టళ్ల కు విద్యార్థి సంఘాలను రాకుండా నిలువరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓను వెంటనే రద్దు చేయాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని, చోడవరం నుంచి పరిసర గ్రామాలకు విద్యార్థులు ప్రయాణించేందుకు వీలుగా గతంలో నడిచే రూట్లలో స్కూల్ బస్సులను పునరుద్ధరించా లని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పీడీఎస్‌ఓ నాయకులు బి.రాజేష్, డి.వరహాలనాయుడు, కె. వరుణ్‌కుమార్, టి.తరుణ్ పాల్గొన్నారు.
చోడవరంలో విద్యార్థుల ర్యాలీ


