● డీసీహెచ్‌ఎస్ రాము
చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో రికార్డులను పరిశీలిస్తున్న డీసీహెచ్‌ఎస్ రాము
చింతపల్లి: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ ఎల్. రాము వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమర్జెన్సీ వార్డు, మందుల నిల్వ గదులు, రక్త పరీక్షల కేంద్రం (ల్యాబ్) పరిశీలించి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిపట్ల సిబ్బంది గౌరవంతో, ఆప్యాయతతో వ్యవహరించాలన్నారు. రోగులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయాలన్నారు. ఇన్‌పేషెంట్లకు ప్రతిరోజూ నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని సూచించారు. ఆసుపత్రిలో చేపట్టాల్సిన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణితో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంతో డాక్టర్ ఇక్రమ్ అలీ ఖాన్, జనరల్ మెడిసిన్ నిపుణులు పవన్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి, ఆఫీస్ సూపరింటెండెంట్ రాజారావు, ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.


