చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ , వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ డి. ఆదిలక్ష్మి తెలిపారు. ఈననెల 9 నుంచి 13 వరకు జిల్లాలో ఉండబోయే వాతావరణ వివరాలను ఆమె వెల్లడించారు. చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో 4 నుంచి 8 మిమీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 35.2 నుండి 37.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 28.0 నుండి 28.4 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 68 నుంచి 75 శాతం, మధ్యాహ్నం 60 నుంచి 72 శాతం మధ్య నమోదు కావచ్చని తెలిపారు. గంటకు 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య/తూర్పు గాలులు వీచే సూచనలు ఉన్నాయని, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వివరించారు. రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకుని రైతులు తమ పంటల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఆర్ డాక్టర్ ఆదిలక్ష్మి సూచించారు.


