మాట్లాడుతున్న జిల్లా సైన్స్ అధికారి రామారావు
చింతపల్లి: విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా సామర్థ్యం పెంపొందించి, వారు సొంతంగా ఆలోచించే విధానాన్ని ఉపాధ్యాయులు అభివృద్ధి చేయాలని జిల్లా సైన్స్ అధికారి కేజే రామారావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఒకరోజు సైన్స్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులలో శాసీ్త్రయ దృక్పథాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించే దిశగా తరగతి గదిలో పాఠాలు, ప్రయోగాలను నిర్వహించాలని సూచించారు. ఈ విద్యాసంవత్సరంలో జరగబోయే ’ఇన్‌స్పైర్ మానక్’ అవార్డులకు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఎన్‌రోల్ అయ్యేలా, ప్రతిష్టాత్మక అవార్డులు సాధించేలా ఉపాధ్యాయులు తర్ఫీదు ఇవ్వాలని కోరారు. సైన్స్ శిక్షణా తరగతులను విద్యార్థులు, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోర్సు డైరెక్టర్, ప్రధానోపాధ్యాయులు సాగిన రామరాజు పడాల్ కోరారు. ఇదే వేదికపై జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న శేషమాంబ, వై. శారదమ్మలను దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.


