యలమంచిలి రూరల్ : మండలంలోని మర్రిబంద గ్రామానికి సమీపంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువలో జారిపడి సోమవారం మర్రిబంద గ్రామానికి చెందిన కంచు అప్పలనాయుడు(58) గల్లంతైనట్టు యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. మర్రిబంద గ్రామానికి చెందిన అప్పలనాయుడు గ్రామస్తులతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఉదయం 11.30 గంటల సమయంలో పోలవరం కాలువ ఒడ్డున కాళ్లు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తూ కాల్వలో జారి పడి గల్లంతయ్యాడు. వెంటనే గ్రామస్తులు వెతికినా అతని ఆచూకీ తెలియలేదు. యలమంచిలి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి అతని ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. పోలవరం కాల్వ లోతు, నీటి ప్రవాహ ఉధృతి కారణంగా ప్రజలు, పిల్లలు, విద్యార్థులు కాల్వలోకి దిగవద్దని ఈ మేరకు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌ఐ తెలిపారు. గల్లంతైన అప్పలనాయుడు తమ్ముడు సన్యాసిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.


