పాడేరు: ప్రతి ఒక్కరూ అభా ఐడీ పొందాలని, దానిలో సమస్త ఆరోగ్య సమాచారం ఉంటుందని కలెక్టర్ నిశాంతి తెలిపారు. మరింత సులభంగా, త్వరగా, సమర్థంగా వైద్య సేవలందించడంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (అభా ఐడీ) ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. సోమవారం ఉదయం స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి ఓపీ సమయంలో వైద్యం కోసం వచ్చిన రోగులు, సందర్శకులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అభా ఐడీ అనేది ప్రతి పౌరుడికి కేటాయించే ఒక డిజిటల్ హెల్త్ ఐడీ అని, దీని ద్వారా రోగులకు చేసిన వైద్య పరీక్షలు, చికిత్సలు, వాడిన మందుల వివరాలు తదితర ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో ఉంటుందన్నారు. ఈ వివరాలను సురక్షితంగా భద్రపరుచుకోవచ్చన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల గిరిజనులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందే సమయంలో వారి గత వైద్య చరిత్ర వైద్యులకు తక్షణమే అందుబాటులో ఉంటుందన్నారు. తద్వారా సరైన వైద్య సేవలు కాలయాపన లేకుండా వేగంగా అందించే అవకాశం ఉందన్నారు. ప్రజలందరూ అభా ఐడీ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి తమ ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరుచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించి తప్పనిసరిగా అభా ఐడీ సృష్టించుకోవాలన్నారు. ఆమె వెంట జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎర్రయ్య, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
కలెక్టర్ నిశాంతి


