చింతపల్లి: ఉపాధి హామీ పథకంలో గిరిజన రైతులకు ఉచితంగా అందజేస్తున్న సిల్వర్‌ఓక్ మొక్కల పంపిణీలో సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.వెంకటరావు హెచ్చరించారు. మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ పరిధిలో గల చెరపల్లిలో సిల్వర్ మొక్కలు పంపిణీ చేసి, ఒక్కొక్క రైతు నుంచి రూ. 2 వందలు వసూలు చేయడంతో గ్రామానికి చెందిన నిరుద్యోగుల సంఘం కో కన్వీనర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏపీడీ, ఏపీవో రాంప్రసాద్‌తో కలసి గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవి గ్రామస్తుల ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు. ఉపాధి సిబ్బంది అక్రమ వసూలకు పాల్పడినట్లు తేలడంతో వసూలు చేసిన సొమ్మును గ్రామ పెద్దల సమక్షంలో గిరిజన రైతులకు అందజేశారు.ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా గిరిజన రైతులను అందేవిధంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ విశ్వనాథం, రఘుపతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


