● ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వంతల కృష్ణ
పాడేరు రూరల్: జిల్లా వ్యాప్తంగా ఉ న్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు తక్షణమే సొంత భవనాలు నిర్మించి, మౌలిక వసతులు కల్పించాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వంతల కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అవసరమైన తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీలేరు, డుంబ్రిగుడ, అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కనీస వసతులు కరువయ్యాయని తెలిపారు. సరిపడా తరగతి గదులు లేక విద్యార్థుల చదువు అస్తవ్యస్తంగా మారిందన్నారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులను పూర్తిస్థాయిలో అందుబాటు లోకి తీసుకురావాలని, అలాగే మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. విద్యార్థుల కనీస సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ అద్వాన పరిస్థితులు దాపురించాయని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి భవనాల నిర్మాణాలు చేపట్టాలని, లేనిపక్షంలో విద్యార్థులను సమీకరించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు గెమ్మెలి బుజ్జి పాల్గొన్నారు.


