● ఈఎన్‌టీ సీనియర్ రెసిడెంట్‌డాక్టర్ వైదేహి విమర్శ
● పాడేరులో నాలుగో రోజుకు చేరిన
నిరసన
పాడేరు రూరల్: జూనియర్ వైద్యుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఈఎన్‌టీ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ వైదేహి విమర్శించారు.స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు నిర్వహిస్తున్న నిరసనలు శనివారం నాటికి నాలుగో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యులు చేపడుతున్న నిరసనలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయని, సంబంధిత శాఖా మంత్రి ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ప్రభుత్వం, ఉన్నత అధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తుండటంతో కొంతమంది జూనియర్ వైద్యులు తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తాత్కాలికంగా విధుల్లో చేరారని, అయినప్పటికీ తాము జిల్లా ఆసుపత్రిలో నిరసనను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటికై నా పెరిగిన ధరలకు అనుగుణంగా వైద్యుల స్టయిఫండ్‌ను పెంచాలని డిమాండ్ చేశారు. జూనియర్ వైద్యుల ఐక్యతను దెబ్బతీయడానికే ప్రభుత్వం దొంగదారిలో ప్రైవేట్ వైద్యులను రంగంలోకి దించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైద్యానికి తూట్లు పొడిచేందుకు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని, ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు భారీగా రాయితీలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జూనియర్ వైద్యుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


