సమరయోధుల త్యాగాలు
పాడేరు తలారిసింగి మైదానంలో జాతీయజెండాను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ నిశాంతి
సాక్షి, పాడేరు: దేశ స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాలు చారిత్రాత్మకమని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి పేర్కొన్నారు. శనివారం పాడేరులోని తలారిసింగి క్రీడా మైదానంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఓపెన్ టాప్ జీపుపై నుంచి పోలీసుల కవాతు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మార్చ్‌పాస్ట్ నిర్వహించిన విద్యార్థులు, అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. పాండ్రంగి గ్రామానికి చెందిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 18 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించి, గిరిజనుల తరఫున బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటం చేశారని, 1924 మే 7న ఆయనను కొయ్యూరులో కాల్చి చంపారని తెలిపారు. అల్లూరితో పాటు గమ్ గంటందొర, గమ్ మల్లుదొర, మర్రి కామయ్య, పండు పడాల్, పనసల పెద్దిపడాల్, తగ్గి వీరయ్య వంటి ఎందరో సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా అభివృద్ధికి..: స్వర్ణాంధ్ర–2047 లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో పీ–4 విధానాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు. లక్షా 310 కుటుంబాలకు గాను, ఇప్పటివరకు 48,721 కుటుంబాలను 6,105 మంది మార్గదర్శకులు దత్తత తీసుకుని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. 225 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.28.22 కోట్లు, 12 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి రూ.34.50 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పీఎం జన్‌మన్ కింద 146 రోడ్లకు రూ.393.42 కోట్లు, 107 అంగన్‌వాడీ భవనాలు మంజూరు కాగా, 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రూ.686 కోట్ల వ్యయంతో 28,691 ఆదివాసీ కుటుంబాలకు పక్కాగృహాలు మంజూరైనట్టు కలెక్టర్ వివరించారు.’జలశక్తి అభియాన్ 2.0’లో సుమారు 10.5 లక్షల పనులు చేపట్టి జాతీయ స్థాయిలోనూ, ’జలధార–జలహారతి’లో 9,284 పనులు చేపట్టి రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఆమె వివరించారు. ఈ ఏడాది 145 డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ.1.72 కోట్ల రుణాలు అందించడంతో పాటు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం, సీ్త్రశక్తి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.
ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక ప్రదర్శనలు
పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. థింసా నృత్యాలు, నాటక పదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనల్లో పెదగరువు బాలికల ఆశ్రమ పాఠశాల బాలికలు ప్రథమ స్థానం, లోచలిపుట్టు బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానం, తలారిసింగి గిరిజన సంక్షేమశాఖ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానం, పాడేరు, చింతపల్లి బాలసదనం చిన్నారులు నాలుగో స్థానం, గౌతమి ప్రైవేట్ పాఠశాల విద్యార్ధులు ఐదవ స్థానం సాధించారు. వీరిని కలెక్టర్ నిశాంతి బహుమతులు అందజేశారు.
● జిల్లా అభివృద్ధి, సంస్కృతికి సంబంధించి ప్రభుత్వశాఖలు పోటీగా శకటాలను ప్రదర్శించాయి. వీటిలో వైద్య ఆరోగ్యశాఖ శకటం ప్రథమ, వ్యవసాయశాఖ ద్వితీయ, అటవీశాఖ తృతీయ, నాలుగో స్థానంలో గృహనిర్మాణశాఖ, ఐదవ స్థానంలో విద్యుత్‌శాఖ శకటాలు నిలిచాయి. వీటికి సంబంధించిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాళ్లను కలెక్టర్ నిశాంతి,జేసీ తిరుమణి శ్రీపూజ,ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ తిలకించారు. డ్రోన్‌తో మారుమూల ప్రాంతాల్లో వైద్యానికి మందులు సరఫరా ప్రదర్శన ఆకట్టుకుంది. స్వాతంత్య్ర సమరయోధులు గాం గంటందొర వారసులతో పాటు పలు కుటుంబాలకు కలెక్టర్ నిశాంతి,జేసీ తిరుమణి శ్రీపూజ,ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ సత్కరించారు.
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం : జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ
సాక్షి,పాడేరు: భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అన్నారు. కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆమె జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భుజంగరావు, ఇన్‌చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, కలెక్టరేట్‌లోని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
పాడేరు : స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఆదిత్యవర్మ, ఐటీడీఏ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలోని అల్లూరి సీతారామరాజు, గాం మల్లుదొర, గాం గంటం దొర, బిర్సాముండా కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పీవో జెండాను ఎగురవేసి గౌరవవందనం సమర్పించారు. ఏపీవో వెంకటేశ్వరరావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ పాల్గొన్నారు.
జిల్లా సమగ్రాభివృద్ధి,పేదరిక నిర్మూలన లక్ష్యం
కలెక్టర్ నిశాంతి
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్తమ అధికారులకు అవార్డులు
సెల్యూట్ చేసిన స్నిఫర్ డాగ్
పోలీసులు ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకోగా, అందులో ఒక ప్రత్యేక ఘట్టం అందరి దృష్టినీ ఆకర్షించింది. పోలీసు జాగిలం అద్భుతమైన క్రమశిక్షణను ప్రదర్శిస్తూ, నేరుగా కలెక్టర్ టి. నిశాంతి వద్దకు వచ్చింది. చాలా సౌమ్యంగా తన నోటితో ఒక అందమైన పుష్పగుచ్ఛాన్ని కలెక్టర్ గారికి అందించింది. కలెక్టర్ గారు ఎంతో ఆప్యాయంగా ఆ పుష్పగుచ్ఛాన్ని స్వీకరించి, ఆ శునకాన్ని మెచ్చుకున్నారు. అనంతరం ఆ జాగిలం వెనక్కి తగ్గి, కలెక్టర్ గారికి ఎదురుగా నిలబడి తన రెండు ముందు కాళ్లను పైకి లేపి ప్రత్యేకమైన రీతిలో సెల్యూట్ చేసింది. జంతువులకు కూడా ఇంతటి క్రమశిక్షణ ఉంటుందని నిరూపించిన ఈ ఘట్టం వేడుకలకే హైలైట్‌గా నిలిచింది.


