మారికవలస గురుకులంలో 5,6,7 తరగతులను ఎత్తివేసేందుకు చర్యలు
ప్రిన్సిపాల్ తీరుపై తల్లిదండ్రుల మండిపాటు
పాడేరులో ఆందోళన, కలెక్టర్, ఐటీడీఏ ఏపీవోలకు వినతి
ఉన్నఫలంగా విద్యార్థులను తీసుకుపోవాలనడం దారుణం : ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
పాడేరు: గిరిజన విద్యార్థులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్యార్థులకు మెరుగైన విద్యనందించడం మాట అటుంచి, వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే విధంగా చర్యలు తీసుకుంటోంది. విశాఖపట్నంలోని మారికవలస గిరిజన గురుకుల ఇంగ్లిష్ మీడియం బాలుర పాఠశాలలో ఈ ఏడాది నుంచి 5, 6, 7 తరగతులను ఎత్తివేస్తున్నామని, ఇక్కడ ఆయా తరగతులు చదువుతున్న విద్యార్థులు వెనక్కి వెళ్లిపోవాలని, ఈనెల 24న నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్‌లో పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు కంగుతిన్నారు. మారికవలస గిరిజన గురుకుల పాఠశాలలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 మండలాలకు చెందిన 300 మంది విద్యార్థులు 5, 6, 7 తరగతులు చదువుతున్నారు. ఈ ఏడాది కూడా ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపారు.
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పేరుతో...
కాగా, ఈనెల 24న నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్‌లో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లారు. అదేరోజు విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమైన ప్రిన్సిపాల్ పాఠశాలను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మారుస్తున్నామని, విద్యార్థులు ఐఐటీ/ఎన్‌ఐటీ, నీట్ పరీక్షల్లో శిక్షణ పొందేందుకు అనువుగా స్థానికంగా ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు ప్రవేశపెడుతున్నామని, వెంటనే 5, 6, 7 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులను తమకు నచ్చిన చోటికి తీసుకువెళ్లి చదివించుకోవాలని ఆదేశించారు. దీంతో ఏం చేయాలో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇదేమిటని అక్కడే ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. కానీ తాము చేసేదేమీ లేదని చెప్పడంతో అక్కడ నుంచి వచ్చేశారు.
పాడేరులో ఆందోళన
తమ పిల్లలను టెన్త్ వరకు మారికవలసలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పాడేరు లో తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. తొలుత పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణలను స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి తమ సమస్యను వివరించారు. దీంతో ఎమ్మెల్యే, అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ వారిని వెంటపెట్టుకొని ఐటీడీఏకు వెళ్లారు. ఐటీడీఏ పీవో అందుబాటులో లేకపోవడంతో ఏపీవోను కలిసి సమస్యను వివరించి, వినతిపత్రాన్ని అందజేశారు. ఐటీడీఏ బయట కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు అక్కడ నుంచి కలెక్టరేట్‌కు వెళ్లారు. అక్కడ నిరసన వ్యక్తం చేసి, కలెక్టర్ నిశాంతికి సమస్యను వివరించి వినతిపత్రాన్ని అందజేశారు.
దుర్మార్గమైన చర్య
5,6,7 తరగతులు చదువుతున్న విద్యార్థులను మారికవలస పాఠశాల నుంచి వెనక్కి వెళ్లిపోమనడం దుర్మార్గమైన చర్య. గిరిజన విద్యార్థులకు విద్యను దూరం చేయాలని సర్కారు యత్నిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి మారికవలస పాఠశాలలో అదనపు భవనాలు నిర్మించింది. ప్రస్తుతం ఆ భవనాలు ఖాళీగానే ఉన్నాయి. అందులో స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నిర్వహించవచ్చు. కానీ అదే సాకుగా చూపించి వేరేచోటుకు వెళ్లిపోవాలని చెప్పడం కరెక్ట్ కాదు. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని విద్యార్థులను యథావిధిగా అక్కడే కొనసాగించాలి. లేని పక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మారికవలస పాఠశాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం.
– మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు


