సాక్షి,పాడేరు: డీఎస్సీ,నీట్ నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెంది, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్నాయని, ఇందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కేంద్రం పాడేరులో నిరసన ర్యాలీ నిర్వహించనున్నామని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు.సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో అనేక అక్రమాలు జరిగాయని, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతిలోను కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. నీట్ పరీక్ష పేపరు లీకేజ్‌తో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు వైఎస్సార్‌సీపీ యువజన,విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తలపెట్టామన్నారు. మంగళవారం ఉదయం తమ క్యాంపు కార్యాలయం నుంచి పాతబస్టాండ్ వరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసన ర్యాలీ జరుగుతుందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర,జిల్లా విభాగాల నేతలు,అన్ని మండలాల అధ్యక్షులు,స్థానిక ప్రజాప్రతినిధులు,మాజీ సర్పంచ్‌లు, నాయకులు,కార్యకర్తలతో పాటు యువజన,విద్యార్థి విభాగం నేతలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
నిరసన ర్యాలీని విజయవంతం చేయండి
అరకులోయటౌన్: అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం అరకులోయలో మంగళవారం వైఎస్సార్‌సీపీ విద్యా ర్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. సోమవారం అరకులోయ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ర్యాలీ వాల్‌పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ర్యాలీలో అరకులోయ నియోజకరవర్గ పరిధిలోని విద్యార్థులు, యువత, యువజన విభాగం నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, సీబీఐతో విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య, వైఎస్సార్‌సీపీ అరకులోయ, డుంబ్రిగుడ మండల అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు కమిడి అశోక్ కుమార్, సెంబి సన్యాసిరావు, దురియా భాస్కరరావు, ఓలేసి రాజ్‌కుమార్, కొర్రా అర్జున్‌రావు, సెంబి సుందరరావు, పార్టీ యువజన విభాగం నాయకులు బోయి కిరణ్‌కుమార్, జిన్ని గెన్ను తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు


