సాక్షి,పాడేరు: స్థానిక గిరికై లాస క్షేత్రంలోని ఉమానీలకంఠేశ్వరస్వామి సమేత రాజరాజేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారిని సోమవారం కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు. స్వామివారిని, ఇతర దేవతామూర్తులను కూడా ఆకుకూరలతో అలంకరించారు.ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలం నాయుడు,రమాదేవి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం,వైదేహి దంపతులు, ఇతర కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో శాకంబరి ఉత్సవాన్ని వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లోక కల్యాణార్థం ఆలయ ప్రధాన అర్చకుడు ఉప్పల రామం ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వేకువజాము నుంచే దేవతామూర్తులను భక్తులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,డాక్టర్ తమర్బ నరసింగరావుతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు,ఉద్యోగ,ఉపాధ్యాయులు,వర్తకులు, భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.


