రోగాలు కొని తెచ్చుకున్నట్టే! | - | Sakshi
Sakshi News home page

రోగాలు కొని తెచ్చుకున్నట్టే!

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

●నాణ్యతకు నీళ్లు

కోటవురట్ల : పల్లెల్లో ఒకపుడు బోరు, బావి నీళ్లనే తాగేవారు. అప్పట్లో ఏ రోగాలు ఉండేవి కాదు. కానీ నేడు ప్రతి కుటుంబం మంచినీళ్లను కొనుక్కుని తాగే పరిస్థితులు పూర్తిగా వచ్చేశాయి. దీంతో మంచినీళ్ల వ్యాపారం పల్లెలకూ పాకింది. మూడు క్యాన్లు...ఆరు ప్లాంట్లుగా వర్ధిల్లుతోంది. మినరల్‌ వాటర్‌ పేరుతో విక్రయిస్తున్న నీళ్లు ఎంతవరకు సురక్షితమో కూడా తెలియని స్థితిలో ప్రతి ఒక్కరూ ఆర్వో ప్లాంట్లపై ఆధారపడిపోయారు. శరీరానికి కావలసిన మినరల్స్‌ ఆర్వో ప్లాంట్లలోని నీళ్ల ద్వారా అందుతున్నాయా అంటే ప్రశ్నార్ధకమే. ఈ ప్లాంట్లలో నీళ్లు ఎంతవరకు సురక్షితమో పట్టించుకున్న నాధుడే లేడు. చాలా వాటర్‌ ప్లాంట్లలో నీళ్లు రుచిగా ఉండేందుకు కెమికల్స్‌ను వినియోగించడమే కాకుండా టీడీఎస్‌ను 20లో సెట్‌ చేస్తున్నారు. దీని వల్ల ఆ నీళ్లలో మినరల్స్‌ పూర్తిగా చనిపోయే పరిస్థితి ఉంది.

కొరవడిన పర్యవేక్షణ..

ఆర్వో ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో 25 లీటర్ల క్యాన్‌తో ఇంటికి తెచ్చుకుని ఇంటిల్లిపాదీ తాగుతున్నారు. శరీరానికి కావలసిన మినరల్స్‌ అందకపోవడంతో మోకాళ్ల నొప్పులు, జాయింట్లు, కీళ్ల నొప్పులు చుట్టుముడుతున్నాయి. ప్రజారోగ్యాన్ని పట్టించుకోని అధికారులు పల్లెల్లో వెలసిన ఆర్వో ప్లాంట్ల తనిఖీని పూర్తిగా గాలికొదిలేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోగా ఆర్వో ప్లాంట్లలో నీటి పరీక్షలు కూడా జరపడం లేదు. కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఆర్‌వో ప్లాంట్లలో ఫిల్టర్‌ చేసిన నీటిని ప్లాస్టిక్‌ క్యాన్లలో పట్టి దర్జాగా విక్రయిస్తున్నారు. వాస్తవానికి ఈ వాటర్‌ ప్లాంట్ల నిర్వహణకు అనుమతులు తీసుకోవలసిఉంటుంది. కానీ చాలా చోట్ల అనుమతి తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆర్‌వో ప్లాంట్‌ వద్ద 20 లీటర్ల వాటర్‌కు రూ.10, డోర్‌ డెలివరీ చేస్తే రూ.30 నుంచి రూ.40 వసూలు చేస్తున్నారు. ఇందులో కూలింగ్‌ వాటర్‌ అయితే 20 లీటర్ల క్యానుకు రూ.70 వరకు వసూలు చేస్తున్నారు. వివాహాది శుభకార్యాలకు ఇదే వాటర్‌ని వినియోగిస్తున్నారు. పల్లెల్లో అయితే ప్లాస్టిక్‌ వాటర్‌ ప్యాకెట్లను బహిరంగంగానే విక్రయిస్తున్నారు. వాటర్‌ ప్యాకెట్లు వాడడం వల్ల ఎండ వేడికి రసాయనాలు వాటర్‌లో కలిసే ప్రమాదం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. అధికారులు ఈ వాటర్‌ ప్లాంట్లను తనిఖీ చేసి నీటి సాంద్రత, ఫిల్టర్ల నాణ్యత, నీటి శుద్ధికి వినియోగిస్తున్న రసాయనాలు ఏమేరకు వినియోగిస్తున్నారో తదితర అంశాలను నిర్ధారణ చేసుకోవలసి ఉంటుంది. కానీ అధికారులు ఎక్కడా కూడా ఆర్‌వో ప్లాంట్లను తనిఖీ చేసిన దాఖలాలు కనిపించవు.

మినరల్స్‌ మాయం..

ఆర్‌వో ప్లాంట్లలో నీళ్లు రుచి కోసం టీడీఎస్‌ 20 శాతానికి లోపులోనే ఉంచుతున్నారు. దాంతో ఈ నీళ్లల్లో పూర్తిగా మినరల్స్‌ ఉండడంలేదు. ఒక మనిషి రోజుకు 2 నుంచి 2.5 లీటర్ల నీటిని తీసుకోవలసి ఉంటుంది. 2 లీటర్ల నీటిని తాగితే ఒక శాతం రాగి, 6 శాతం కాల్షియం, 5 శాతం మెగ్నీషియం, 3 శాతం సోడియం లభిస్తాయి. కానీ ఆర్వో ప్లాంట్లలో నీటిని తాగడం వల్ల ఇవన్నీ శరీరానికి అందడం లేదు. దాంతో ప్రతీ ఒక్కరికీ వయస్సుతో సంబంధం లేకుండా కీళ్ల జబ్బులు, మోకాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కువగా ఆర్‌వో ప్లాంట్ల నీళ్లను తాగితే శరీరానికి కవలసిన ఖనిజాలను కోల్పోతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వాల్టా చట్టానికి తూట్లు..

వాల్టా చట్టం ప్రకారం కొత్తగా బోరు వేసుకోవాలంటే రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు చేశాక పరిశీలన చేసి నీటి లభ్యతను బట్టి బోరు వేయడానికి అనుమతి ఇస్తారు. కానీ ఆర్‌వో వాటర్‌ ప్లాంట్ల నిర్వాహకులు బోరు కోయడానికి గానీ, ప్లాంట్‌ నడపడానికి కానీ అనుమతి తీసుకోకుండానే అనధికారికంగా నిర్వహించి వాల్టా చట్టాన్ని తుంగలోకి తొక్కుతున్నారు. ఈ ప్లాంట్ల నిర్వహణకు 14 రకాల అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా, బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ సర్టిఫికెట్‌, భూగర్భ జల సంస్ధ, ఐఎస్‌ఐ, ఐఎస్‌వో, ల్యాబ్‌ పరీక్షా పత్రం, అర్‌డబ్ల్యుఎస్‌, పర్యావరణ శాఖల అనుమతులు తప్పనిసరి. ఇష్టానుసారంగా బోర్లు కోసి నిరంతరాయంగా నీటిని తోడడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.

మినరల్స్‌ అందేలా చూసుకోవాలి..

శరీరానికి కావలసిన మినరల్స్‌ను ఆహారం, నీళ్ల ద్వారా తీసుకోవాలి. అంతా కలుషితం కావడం వల్ల పూర్తి స్థాయిలో మినరల్స్‌ అందడంలేదు. దాంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. చాలా ఆర్వో ప్లాంట్లలో రుచికోసం కెమికల్స్‌ వాడుతున్నారు. టీడీఎస్‌ కూడా తక్కువ పెడుతున్నారు. దాంతో వీటిలో మినరల్స్‌ అందే అవకాశం లేదు. దాంతోనే మోకాళ్లు, కీళ్లు, జాయింట్‌ నొప్పులు వస్తున్నాయి. ప్లాస్టిక్‌ కవర్లలోని మంచినీళ్లను తాగకూడదు. ప్లాస్టిక్‌ క్యాన్లు సరిగ్గా శుభ్రం చేయకుండా వినియోగిస్తే కలరా, టైఫాయిడ్‌, అతిసార, పచ్చకామెర్లు, కాలేయ, కిడ్నీ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. బోరు, బావి నీళ్లు, రక్షిత మంచినీటి పధకాల నీళ్లను మరిగించి చల్లార్చి వడకట్టి తాగితే ఆరోగ్యానికి మంచిది.

– డాక్టర్‌ సంతోష్‌కుమార్‌, వైద్యాధికారి, కె.వెంకటాపురం

‘శుద్ధజలం’ ఎంత సురక్షితం

పల్లెలకు పాకిన ఆర్వో ప్లాంట్లు

మినరల్స్‌ లేని మినరల్‌ వాటర్‌

నాణ్యత ప్రశ్నార్థకం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement