అమర్‌నాథ్‌పై వ్యక్తిగత దూషణలు సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్‌పై వ్యక్తిగత దూషణలు సహించేది లేదు

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

● హోంమంత్రి శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలి ● యలమంచిలి వైఎస్సార్‌సీపీ నేతలు

యలమంచిలి రూరల్‌: ఆరు దశాబ్దాల రాజకీయ చరిత్ర నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై వ్యక్తిగత దూషణలు, విమర్శలు మానుకోవాలని హోం మంత్రి, టీడీపీ నాయకులకు యలమంచిలి వైఎస్సార్‌సీపీ నేతలు హితవు పలికారు. గుడివాడ అమర్‌నాథ్‌పై అనుచిత వ్యాఖ్యలను సహించేది లేదని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోదెపు గోవింద్‌ స్పష్టం చేశారు. మంగళవారం యలమంచిలి పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడారు. హోం మంత్రి అనిత, టీడీపీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై చేస్తున్న వ్యక్తిగత విమర్శలను ఖండించారు. సూపర్‌ సిక్స్‌ హామీల అమలు చేయకపోవడం, మెగా డీఎస్సీలో అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి వ్యక్తిగత దూషణలకు తెగబడుతున్నారని విమర్శించారు. గుడివాడ అమర్‌నాథ్‌ తండ్రి గుర్నాథరావు రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా సేవలందించి ఉమ్మడి విశాఖ జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నారు. రెండ్రోజులుగా టీడీపీ నేతలు నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం హుందాతనంగా లేదన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ క్రీడా కోటాలో జరిగిన అక్రమాలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వం ఇప్పటివరకు సమాధానం చెప్పకుండా నిరుద్యోగులకు మరిన్ని అనుమానాలు కలిగేలా వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా హోం మంత్రి సొంత జిల్లాలో శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలని, రాంబిల్లి మండలంలో బాలికను ప్రేమ పేరుతో ఉన్మాది హత్య చేస్తే ఇప్పటివరకు ఆ కుటుంబాన్ని పరామర్శించే తీరిక ఆమెకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వలేదన్నారు. సీ్త్రశక్తి పథకం, తల్లికి వందనం వంటి పథకాలు కూడా అరకొరగా అమలు చేస్తూ ప్రజలకిచ్చిన హామీలు గాలికొదిలేశారన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటైందని, ఇప్పుడు వేలాది మంది పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన అమర్‌నాథ్‌ను నైతికంగా దెబ్బతీసి, రాజకీయంగా అణగదొక్కేందుకే ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. ఇలాంటి పద్ధతులు మంచివి కాదని హితవు పలికారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై వ్యక్తిగత, రాజకీయ విమర్శలు మాని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొద్దపు ఎర్రయ్యదొర, యలమంచిలి జెడ్పీటీసీ సేనాపతిసంధ్యారాణిరాము, పార్టీ మండల అధ్యక్షుడు కొల్లి త్రినాథరావు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్లు బెజవాడ నాగేశ్వర్రావు, అర్రెపు గుప్తా, మండల యువజన విభాగం అధ్యక్షుడు సంతోష్‌ వర్మ, మర్రి రాజు, మాజీ వార్డు కౌన్సిలర్లు పిల్లా త్రినాథరావు, పిట్టా సత్తిబాబు, ఎడ్ల వాసు, ఉప్పులూరి కిరణ్‌, రాధా మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement