ఏయూలో బయోమెట్రిక్‌కు బైబై..! | - | Sakshi
Sakshi News home page

ఏయూలో బయోమెట్రిక్‌కు బైబై..!

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

● సమయపాలనపై కొరవడిన నిఘా ● ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలుపై నిర్లిప్తత ● ఏయూ తీరే వేరు

విశాఖ విద్య: ఉద్యోగుల సమయపాలనకు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యమిస్తున్న తరుణంలో ఏయూలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బోధన సిబ్బంది సమయానికి తరగతులకు హాజరవుతున్నారా లేదా అన్న అంశంపై పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ము ఖ్యంగా తరగతుల నిర్వహణ, అధ్యాపకుల హాజరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో కఠినంగా అమలైన బయోమెట్రిక్‌

గతంలో సమయపాలన పాటించేలా ఏయూ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. ప్రతి విభాగంలో బయోమెట్రిక్‌ యంత్రాలను ఏర్పాటు చేసి, విధులకు హాజరైన వెంటనే వేలిముద్ర నమోదు తప్పనిసరి చేసింది. ఉద్యోగుల హాజరు, తరగతుల నిర్వహణపై నియంత్రణ పెరిగి వ్యవస్థ సజావుగా సాగింది.

విద్యార్థుల ఫిర్యాదులే కారణం

ఇంజినీరింగ్‌ కళాశాలలో అధ్యాపకులు తరచూ తరగతులకు గైర్హాజరవుతున్నారంటూ గతంలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ముఖ్యంగా మొదటి సంవత్సరం విద్యార్థులకు సమయానికి తరగతులు జరగకపోవడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి చేరిన విద్యార్థులకు బోధన సక్రమంగా అందకపోవడంపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే బయోమెట్రిక్‌ విధానం అమల్లోకి వచ్చింది.

పాడైన యంత్రాలు.. తగ్గిన పర్యవేక్షణ

ప్రస్తుతం అనేక విభాగాల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు పనిచేయ ని స్థితికి చేరుకున్నా యి. వాటి మరమ్మతులు, ప్రత్యామ్నా య ఏర్పాట్లపై చర్య లు లేకపోవడంతో వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్న విమర్శలున్నాయి. సమయపాలన విషయంలో పర్యవేక్షణ తగ్గిపోవడంతో కొందరు ఉద్యోగులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు ఎక్కడ?

బయోమెట్రిక్‌ విధానానికి ప్రత్యామ్నాయంగా ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమలు చేయాలని గతంలో ప్రతిపాదించినా, ఆ ప్రక్రియ ఎక్కడిదాకా వచ్చిందనే విషయంపై స్పష్టత లేదు. అధ్యాపకులు అధికారిక పనుల నిమిత్తం తరచూ బయటకు వెళ్లాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితుల్లో బయోమెట్రిక్‌ అమలు ఎలా ఉంటుందన్న సందేహాలు కూడా ఉన్నాయి.

సమయపాలనపై సీరియస్‌గా ఉండాలి: ఎస్‌ఎఫ్‌ఐ

ఏ సంస్థలోనైనా క్రమశిక్షణ, సమయపాలన ఉంటేనే మెరుగైన ఫలితాలు సాధ్యమ వుతాయని జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి అజయ్‌ అన్నారు. బయోమెట్రిక్‌ విధానం కొనసాగించడం అవసరమని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. తాత్కాలిక అధ్యాపకులతో బోధన నాణ్యత దెబ్బతింటోందని, పూర్తి స్థాయి నియామకాలు చేపట్టాలని కోరారు. సమయపాలన, హాజరు పర్యవేక్షణ, ఖాళీ పోస్టుల భర్తీ వంటి అంశాలపై యూనివర్సిటీ యంత్రాంగం దృష్టి సారించకపోతే విద్యా ప్రమాణాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement