మన్యం పర్యాటకంలో సరికొత్త అధ్యాయం
● ముంచంగిపుట్టు, సీలేరు కేంద్రంగా వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టులు
● సుమారు రూ.16.45 కోట్ల వ్యయంతో నిర్మాణం
● ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి
● అందుబాటులోకి వస్తే మరోస్థాయికి చేరనున్న పర్యాటక రంగం
సీలేరు: పచ్చని అడవులు, ఎత్తయిన కొండలు, జాలువారే జలపాతాలు.. సముద్ర మట్టానికి 1350 అడుగుల ఎత్తులో కొండల మధ్య ఒంపుసొంపులు తిరిగే ప్రయాణం.. తూర్పు కనుమల నుంచి వందల కిలోమీటర్ల మేర ప్రవహించే జలసిరి.. రాష్ట్రానికి వెలుగులు నింపే విద్యుత్ కేంద్రాలు, రిజర్వాయర్లు.. వీటికి తోడు గిరిజన సంప్రదాయాలు, వారి కట్టుబొట్టు.. అరకు అందాలు, మంచు కురిసే లంబసింగి, ప్రాచీన ఆలయాలు.. ఇలా ఎన్నో విశిష్టతలకు ఈ జిల్లా నెలవు. రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన ఈ ప్రాంతం, ఇప్పుడు ప్రపంచ స్థాయి పర్యాటక వేదికగా అభివృద్ధి చెందబోతోంది.
● ప్రస్తుతం దేశ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు ఈ ప్రాంత అందాలను తిలకించేందుకు కేవలం వాహనాలపైనే ఆధారపడుతున్నారు. అయితే, త్వరలో జిల్లాలో అందుబాటులోకి రానున్న వాటర్ ఏరోడ్రోమ్ (సీ ప్లేన్) ప్రాజెక్టులతో పర్యాటక రంగం మరో స్థాయికి చేరనుంది.
జిల్లాలో రెండు ప్రాజెక్టులు
ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చనున్నాయి. దీనికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది.
ప్రయాణ మార్గమిలా..
పర్యాటకులు మొదట విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి సీ ప్లేన్ ద్వారా నేరుగా ముంచంగిపుట్టు చేరుకోవచ్చు. అక్కడికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకు, దాని పరిసర ప్రాంతాలను సులభంగా సందర్శించవచ్చు.
సీలేరు కనెక్టివిటీ..
లంబసింగితో పాటు ఇతర ప్రకృతి అందాలను వీక్షించేందుకు వీలుగా, సీలేరు గుంటవాడ రిజర్వాయర్ వద్ద మరో వాటర్ ఏరోడ్రోమ్ నిర్మించనున్నారు.
పర్యాటక రంగ అభివృద్ధికి దోహదం
జిల్లాలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందడానికి ఈ వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయి. వీటి వల్ల జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభించడమే కాకుండా, స్థానిక గిరిజన ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాపారాలు వృద్ధి చెంది, స్థానిక యువతకు ఈ ఎయిర్‌పోర్టుల నిర్వహణలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జిల్లా అభివృద్ధిని కాంక్షిస్తూ చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం.
–తిరుమణి శ్రీపూజ, జాయింట్ కలెక్టర్, పాడేరు


