పెదబయలు: సొంత నిధులతో తాగునీటి పథకాన్ని పూర్తి చేసిన కాంట్రాక్టరును బిల్లు కోసం ముప్పతిప్పలు పెట్టి, లంచం డిమాండ్ చేసిన ఓ పంచాయతీ కార్యదర్శి చివరకు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాఖ ఏసీబీ డీఎస్పీలు ఎస్‌ఆర్ హర్షిత, బీవీఎస్‌ఎస్ రమణమూర్తి ఈ కేసు వివరాలను వెల్లడించారు.
అసలేం జరిగిందంటే?
బొండాపల్లి గ్రామ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులతో, బూరుగువీధి గ్రామంలో రూ.2.27 లక్షల అంచనా వ్యయంతో తాగునీటి ట్యాంకులు, పైపులైన్ల పనులను కాంట్రాక్టర్ దొర మల్లేశ్వరరావు పూర్తి చేశారు. ఈ పనులకు సంబంధించి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఎం–బుక్ రికార్డింగ్ కూడా పూర్తి చేశారు. అయితే, బిల్లు మంజూరు (చెక్ మెజర్‌మెంట్) కోసం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–3 కాండ్రేగుల లక్ష్మీనారాయణ వద్దకు కాంట్రాక్టర్ మల్లేశ్వరరావు వెళ్లగా, ఆయన కేవలం రూ.1.30 లక్షలకు మాత్రమే చెక్ ఇచ్చారు. మిగిలిన రూ.97 వేల బిల్లు మంజూరు చేయాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాల్సిందేనని కార్యదర్శి భీష్మించి కూర్చున్నారు. అప్పులు తెచ్చి పనులు పూర్తి చేసిన తనకు న్యాయం చేయాలని కాంట్రాక్టర్ కోరినా వినకపోవడంతో, బాధితుడు ఈనెల 7వ తేదీన విశాఖ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
బాధితుడి ఫిర్యాదుతో..
బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు బుధవారం పథకం ప్రకారం వల పన్నారు. పెదబయలులోని తన నివాసంలో కాంట్రాక్టరు నుంచి రూ.30 వేల నగదును లంచంగా తీసుకుంటుండగా లక్ష్మీనారాయణను ఏసీబీ బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆయన నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీలు తెలిపారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం. ప్రభుత్వ సేవల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించండి. ఫిర్యాదుదారుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో విశాఖ ఏసీబీ సీఐలు సుప్రియ, శ్రీనివాసరావు, వెంకట్రావు, లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు.
లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన బొండాపల్లి పంచాయతీ కార్యదర్శి


