పెదగంట్యాడ : భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం పాలైన హృదయ విదారకమైన సంఘటన గాజువాక దరి శ్రీనగర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివి. శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన గురిబిల్లి జోగిరెడ్డి, గురిబిల్లి శాంతమ్మ (43) భార్యాభర్తలు. వీరిద్దరూ సోమవారం వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై శ్రీనగర్ వస్తుండగా.. గాజువాక పోలీస్‌స్టేషన్ సిగ్నిల్ పాయింట్ దాటిన తర్వాత వెనుక నుంచి వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో శాంతమ్మ వాహనంపై నుంచి కిందపడిపోయింది. లారీ ఆమె తలపై నుంచి వెళ్లిపోవడంతో తల భాగం నుజ్జునుజ్జయింది. తన కళ్లెదుటే భార్య దుర్మరణం చెందడంతో భర్త కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న గాజువాక పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


