రాత్రంతా ఆరుబయటే.. | - | Sakshi
Sakshi News home page

రాత్రంతా ఆరుబయటే..

Apr 6 2026 7:36 AM | Updated on Apr 6 2026 7:36 AM

బంధువుల ఆవేదన

ముంచంగిపుట్టు: మండలంలోని 23 పంచాయతీల పరిధిలోని గిరిజన గ్రామాల్లో శనివారం రాత్రి సంభవించిన భూప్రకంపనలు కలకలం రేపాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శనివారం రాత్రి 11.33 నిమిషాల సమయంలో భూమి కంపించడం ప్రారంభమైంది. ఇళ్లలోని వస్తువులు కింద పడిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందారు. బయటే గడిపిన ప్రజలు ప్రకంపనల ధాటికి భయపడిన గిరిజనులు గంటల తరబడి ఇంటి బయటే ఉండిపోయారు. అంతా సద్దుమణిగిన తర్వాత ఇళ్లలోకి వెళ్లి పరిస్థితిని గమనించారు. కింద పడిపోయిన వస్తువులను, సామాన్లను తిరిగి సర్దుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి తమ బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి, భూకంపం వల్ల కలిగిన నష్టాన్ని, క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

డుంబ్రిగుడ: మండలంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో సంభవించిన భూప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు, ఒక్కసారిగా భూమి కంపించడంతో పాటు సుమారు 10 సెకన్ల పాటు భారీ శబ్దం రావడంతో భయంతో నిద్రలేచి ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.సుమారు గంట సేపటి వరకు ఇళ్లలోకి వెళ్లడానికి భయపడి అంతా బయటే ఉండిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, దేవునిపై భారం వేసి మరికొంతమంది ఇళ్లలోకి వెళ్లి పడుకున్నారు. అదృష్టవశాత్తూ ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వంజరి, గెమ్మెలి, సొలభం, బంధవీధి, సంతబయలు, జి.మాడుగుల, సింగర్భ, గాంధీనగరం, జి.ఎం.కొత్తూరు, జోగులపుట్టు తదితర గ్రామాల్లో కొద్ది సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.

రోలర్‌ శబ్దం అనుకున్నాం: మత్స్యరాజు

పాడేరు పాత ఎంఆర్వో ఆఫీస్‌ కాలనీకి చెందిన తలారి మత్స్యరాజు తన అనుభవాన్ని వివరిస్తూ.. రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి భోజనం చేస్తుండగా 11:30 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఇంటి పైకప్పు రేకులు కదిలి శబ్దం రావడంతో మొదట జాతీయ రహదారి పనుల కోసం వైబ్రేషన్‌ రోలర్‌ వాడుతున్నారేమో అని భ్రమపడ్డాను. కానీ కొద్దిసేపటికే సోషల్‌ మీడియాలో భూప్రకంపనల వార్తలు రావడంతో అసలు విషయం తెలిసింది అని పేర్కొన్నారు.

ఇల్లంతా కదిలిపోయింది

రాత్రి 11.33 గంటల సమయంలో గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా ఇల్లంతా కదిలిపోయింది. ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో భయాందోళనకు గురయ్యాను. వెంటనే కుటుంబ సభ్యులందరినీ నిద్రలేపి సురక్షితంగా బయటకు తీసుకువచ్చాను. సుమారు రెండుసార్లు భూమి కంపించింది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. మొదటిసారి భూకంపం రావడంతో చాలా భయం వేసింది.

– ఎ. సాయికిరణ్‌, ముంచంగిపుట్టు

వస్తువులన్నీకింద పడిపోయాయి

భూమి కంపించడంతో ఇంట్లోని వస్తువులన్నీ కింద పడిపోసాగాయి. గ్రామంలో అందరూ కేకలు వేస్తూ ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. మొదట నాకే ఇలా అనిపించిందేమో అనుకున్నా. కానీ ఆరా తీస్తే మా గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చిందని తెలిసింది. ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం.

– లక్ష్మణ్‌, జోలాపుట్టు

భూప్రకంపనలతో వణికిన గిరిజనులు

తమ వారి క్షేమ సమాచారం కోసం

ఎటువంటి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనం

భయాందోళనకు గురయ్యాం

భూకంపం వస్తే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తే కానీ అర్థం కాలేదు. ఒక్కసారిగా ఇళ్లు కూలిపోతాయేమో అన్నట్లుగా భూమి కంపించింది. ప్రాణభయంతో కుటుంబంతో సహా బయటకు వచ్చేసరికి, అప్పటికే గ్రామస్తులందరూ వీధుల్లోనే ఉన్నారు. ఫోన్ల ద్వారా కూడా చాలా మంది తమ భయాందోళనలను నాతో పంచుకున్నారు. అదృష్టవశాత్తూ మన పంచాయతీ పరిధిలో ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదు కానీ, ఈ ఘటన అందరినీ తీవ్రంగా భయపెట్టింది.

– వి. రమేష్‌, సర్పంచ్‌, సుజనకోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement