రాత్రి సమయంలో సంచరిస్తున్న అడవిదున్న
హుకుంపేట (డుంబ్రిగుడ): ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన హుకుంపేట మండలంలో అడవి దున్న సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. మండలంలోని గరుడపల్లి, పామురాయి గ్రామాల సమీపంలో శనివారం భారీ అడవి దున్న ప్రత్యక్షమవడంతో స్థానిక గిరిజనులు ఒక్కసారిగా భీతిల్లారు. పామురాయి – గరుడపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అడవి దున్న అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహన చోదకులు, గిరిజనులు ఆ భారీ జంతువును చూసి ఒక్కసారిగా వాహనాలు నిలిపివేశారు. ఊహించని విధంగా ఎదురైన అడవి దున్నను చూసి ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో అందరూ చెల్లాచెదురయ్యారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా..
సాధారణంగా ఈ ప్రాంతంలో ఇలాంటి పెద్ద క్రూర మృగాలు సంచరించడం అరుదని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ మా ప్రాంతంలో ఇలాంటి జంతువులు కనిపించలేదు. సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి ఇది ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అని గిరిజనులు వాపోతున్నారు. అడవి దున్న సంచారంతో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా వణికిపోతున్నారు.


