పవర్‌ఫుల్‌ | - | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌

Mar 24 2026 7:51 AM | Updated on Mar 24 2026 7:51 AM

సీలేరు

సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌

సీలేరు: రాష్ట్రంలో సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌కు విశిష్టస్థానం ఉంది. ఏడాదిలో 365 రోజులూ నిరంతరం విద్యుత్‌ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ కాంప్లెక్స్‌ సొంతం.పుష్కలంగా నీటి నిల్వలు ఉండడంతో నిరంతరాయంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ నిర్దేశిత లక్ష్యాలను అధిగమించింది. సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌ జల విద్యుత్‌ కేంద్రాలు గడిచిన 10 రోజులుగా నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. లోడ్‌ డిస్పాచ్‌ అధికారులు ఇచ్చిన లక్ష్యాల మేరకు విద్యుత్‌ కేంద్రాల్లో ప్రస్తుతం జోరుగా ఉత్పత్తి జరుగుతోంది. సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలో మాచ్‌ఖండ్‌, సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రాలున్నాయి. ఈ కాంప్లెక్స్‌లో 2025–26 సంవత్సరంలో 2,314 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యం కాగా సోమవారం సాయంత్రానికి 2,320 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేసి, లక్ష్యాన్ని అధిగమించింది. ఇండివిడ్యువల్‌ లక్ష్యాన్ని కూడా అధిగమించేందుకు పోటాపోటీగా పనిచేస్తున్నాయి. గోదావరి డెల్టాలో రబీ పంటలకు సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌ నుంచి గడిచిన 10 రోజుల్లో రోజుకు 6,900 క్యూసెక్కుల నీరు నేరుగా వెళుతోంది. దీంతో మాచ్‌ఖండ్‌, సీలేరు, పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి జోరుగా సాగుతోంది. 2025–26 సంవత్సరంలో సీలేరు కాంప్లెక్స్‌ విద్యుత్‌ కేంద్రాలకు 2,314 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యం నిర్ధేశించగా ఇప్పటికే 2,320 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి సాధించినట్టు కాంప్లెక్స్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కె.వి. రాజారావు తెలిపారు.

మాచ్‌ఖండ్‌లో అదనంగా ..

ఆంధ్ర,ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ విద్యుత్‌ కేంద్రం ఇప్పటికే తన టార్గెట్‌ను పూర్తిచేసుకుని అదనంగా విద్యుత్‌ ఉత్పత్తిని చేసి, మిగతా జలవిద్యుత్‌ కేంద్రాలకు భిన్నంగా రికార్డు సృష్టించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటిసారిగా నిర్మించిన ఈ విద్యుత్‌ కేంద్రంలో ఆరు యూనిట్లు ఉన్నాయి. ఈ ఏడాది 657 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యం ఇవ్వగా జనవరి 22 నాటికే పూర్తి చేసి మార్చి 15 నాటికి 802 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసింది. ఇప్పటికి 145 మిలియన్‌ యూనిట్లు అధికంగా ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. సీలేరు జల విద్యుత్‌ కేంద్రానికి ఈ ఏడాది 477 మిలియన్‌ యూనిట్లు లక్ష్యం ఇవ్వగా సోమవారం సాయంత్రం నాటికి 429 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసినట్లు ఈఈ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా ప్రస్తుతం జోరుగా విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఈ విద్యుత్‌ కేంద్రానికి ఈ ఏడాది ఇచ్చిన టార్గెట్‌ 1,084 మిలియన్‌ యూనిట్లు కాగా ఇప్పటికే 1,020 పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

సీలేరు కాంప్లెక్స్‌లో లక్ష్యాన్ని మించి విద్యుత్‌ ఉత్పత్తి వేసవిలో విద్యుత్తి ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా చర్యలు

వేసవిలో విద్యుత్‌కి అంతరాయం లేకుండా..

ఏపీ జెన్‌కో సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌లోని విద్యుత్‌ కేంద్రాల్లో ప్రస్తుతం నిరంతరం విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటికే లక్ష్యాన్ని పూర్తి చేశాం. వేసవిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాం. మరోపక్క గోదావరి డెల్టాలో పంట భూములకు గడిచిన పది రోజులుగా డొంక రాయి మెయిన్‌ డ్యామ్‌ ద్వారా నీటిని విడుదల చేస్తూ ఇంజనీర్లు కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు.

–కె.వి రాజారావు, చీఫ్‌ ఇంజనీర్‌

పుష్కలంగా నీటి నిల్వలు

ఏపీ జెన్‌ కో సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌ పరిధిలో పలు రిజర్వాయర్లలో ఈ ఏడాది విద్యుత్‌ ఉత్పత్తికి సరిపడా నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆంధ్ర,ఒడిశా సరిహద్దు బలిమెల జలాశయంలో ప్రస్తుతం 71.1740 టీఎంసీల నీరు ఉంది. దీంతో పాటు అదనంగా గుంటవాడ, సీలేరు రిజర్వాయర్లలో మరో 12 టీఎంసీలు ఉంది. ఉన్న నీటితో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ.. మరోపక్క గోదావరి డెల్టా పంట భూములకు నీరుఅందిస్తూ.. ఈ వేసవిలో విద్యుత్‌ ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రానికి నిరంతరం వెలుగులు అందించడంలో సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌ కీలక పాత్ర పోషిస్తోందని జెన్‌కో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement