కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు: అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లు, జన సముదాయాలు ఉన్న చోట్ల ప్రత్యేక చలివేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అల్లూరి, పోలవరం జిల్లాల అధికారులతో సమీక్షించారు. వేసవి దృష్ట్యా ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని, పశువులు, మేకలు, మూగ జీవాల కోసం గ్రామాల్లో నీటి కుండీలను ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయానికి సాగుకు నీటి కొరత లేకుండా చెక్ డ్యామ్‌ల ద్వారా సరఫరా జరిగేలా చూడాలన్నారు. వడదెబ్బ నివారణ కోసం వైద్యారోగ్య కేంద్రాల్లో అవసరమైన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు రావాలని, మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్పా బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన పోస్టర్లను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెండు జిల్లాల పోలీసు, ఐటీడీఏ, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, డ్వామా, అగ్రికల్చర్, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


