జి.మాడుగుల: జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడి శేఖర్ ఆరోపించారు. స్థానిక విలేకర్లతో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1.72లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 10,060పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదుల చేసిందన్నారు. తక్కువ ఉద్యోగావకాశాలు కల్పించి, ప్రచారం మాత్రం ఊదరగొడుతున్నారని విమర్శించారు. ఈ పోస్టులు కూడా నాలుగు విడతల్లో వచ్చే అక్టోబర్‌లోగా భర్తీ చేయనున్నట్లు ప్రకటించిందన్నారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్ల కాలంలో 20లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఉద్యోగం ఇచ్చేంతవరకు నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, 22నెలలు కాలంలో నిరుద్యోగికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆయన విమర్శంచారు.ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి, అత్యధిక ఉద్యోగాల కల్పనకు ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు ప్రోత్సాహమందిస్తామంటూ ప్రకటించి ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు. నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని రానున్న కాలంలో ప్రజలు, యువత చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.


