డాబాగార్డెన్స్: వేసవి కాలంలో నీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని, నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తూ నగర పరిపాలనకు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఆయన నగర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నగరానికి రోజుకు సుమారు 400 మిలియన్ లీటర్ల నీటి అవసరం ఉండగా, పారిశ్రామిక, ఆర్థిక కేంద్రంగా ఎదుగుతున్న నేపథ్యంలో 2047 నాటికి ఈ అవసరం 726 మిలియన్ లీటర్లకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. నగరానికి దీర్ఘకాలిక నీటి భద్రత కల్పించేందుకు జీవీఎంసీ కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా అంతర్జాతీయ సంస్థలైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగపూర్ వాటర్ సెంటర్, పీయూబీ (సింగపూర్), ఐఎస్‌ఎఫ్ (ఆస్ట్రేలియా) వంటి సంస్థల సాంకేతిక సహకారంతో సమగ్ర వాటర్ సెక్యూరిటీ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ ప్రణాళిక ద్వారా నీటి వనరులను శాసీ్త్రయంగా అంచనా వేయడమే కాకుండా, వినియోగించిన నీటి శుద్ధి, పునర్వినియోగం, భూగర్భ జలాల సంరక్షణ, ఆధునిక సాంకేతికతతో నీటి వృథాను అరికట్టడం వంటి అంశాలకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన వివరించారు.


