అరకులోయ టౌన్: అడవులు జీవ వైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు అత్యంత అవసరమని అరకులోయ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బొర్రా కోటేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని అటవీ శాఖ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ మనుగడ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలన్నారు. ప్రతి ఏటా ఒక ప్రత్యేక అంశం(థీం)తో అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. అడవుల పెంపకం, పునరుద్ధరణ, స్థిరమైన నిర్వహణను ప్రోత్సహించడం 2025–26 నాటి థీంగా అయన పేర్కొన్నారు. అనంతరం అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో పలు మొక్కలు నాటారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్.రామారావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు పాచిపెంట ఉద్దంగి, రామచంద్రుడు, అభిలాష్, వెంకటతేజ్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


