ముంచంగిపుట్టు : మండల కేంద్రం ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో వైద్య సేవల కోసం రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. శనివారం వారపు సంత కావడంతో అధిక సంఖ్యలో రోగులు సీహెచ్‌సీకి వచ్చారు. ఒక్కరే వైద్యాధికారి ఉండడంతో వైద్య సేవల కోసం గంటల తరబడి రోగులు క్యూలో నిరీక్షించాల్సి వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కొందరు రోగులు క్యూలైన్లలో కూర్చుని వేచి ఉన్నారు. సీహెచ్‌సీలో ఏడుగురు వైద్యులు ఉండాలి. ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారిలో ఇద్దరు సెలవులో ఉండడంతో ఒక్క డాక్టర్ మాత్రమే రోగులకు వైద్యం అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా వైద్య విధాన పరిషత్ అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని రోగులు కోరుతున్నారు.


