మన్యం వీరుల పోరాట పటిమను, వారు చిందించిన రక్తపు చుక్కల విలువను నేటి తరానికి చాటిచెప్పేలా తాజంగిలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం రూపుదిద్దుకుంటోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగిన ఈ ప్రతిష్టాత్మక కట్టడం, అడవి బిడ్డల ఆత్మగౌరవ ప్రతీకగా నిర్మితమవుతోంది. అల్లూరి సీతారామరాజు అడుగుజాడల్లో నడిచిన వీరుల చరిత్రను కళ్లకు కట్టబోతోంది. పర్యాటక సీజన్‌నాటికి అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అధికారులు నిర్మాణ పనులను వేగవంతం చేశారు.
● తాజంగిలో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర
సమరయోధుల మ్యూజియం
● వారి సేవలు నేటి తరానికి తెలిసేలా
సంకల్పించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
● నిధుల కొరత వల్ల కొన్నాళ్లు
నత్తనడకన పనులు
● కేంద్ర ప్రభుత్వం చొరవతో ఊపందుకున్న నిర్మాణాలు
● పర్యాటక సీజన్ నాటికి అందుబాటులోకి తెస్తామంటున్న అధికారులు
చింతపల్లి: ప్రముఖ పర్యాటక ప్రాంతం లంబసింగికి సమీపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులు ఊపందుకున్నాయి. ప్రారంభంలో ఈ పనులు వేగంగా జరిగినప్పటికీ, మధ్యలో కొన్ని కారణాల వల్ల నిలిచిపోయాయి. గతంలో రెండుసార్లు టెండర్లు పిలిచినా పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు. అయితే, మూడవసారి టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్మాణ పనులపై దృష్టి సారించారు. దీని నిర్మాణానికి రూ.35 కోట్లు (కేంద్రం వాటా రూ.15 కోట్లు, రాష్ట్ర వాటా రూ.20కోట్లు వెచ్చించాయి. తాజంగిలోని వ్యవసాయ శాఖకు చెందిన 22 ఎకరాల్లో దీని నిర్మాణం చేపట్టారు. ఇందులోని 11 ఎకరాల్లో మ్యూజియం నిర్మిస్తున్నారు. మిగిలిన 11 ఎకరాల్లో పర్యాటకరంగానికి సంబంధించి కట్టడాలకు కేటాయిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2021 అక్టోబర్ 8న అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
మ్యూజియం ప్రత్యేకతలు..
దేశవ్యాప్తంగా బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుల చరిత్రను భావితరాలకు తెలియజేసేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దుతున్నారు. గిరిజన వీరుల పోరాట పటిమను భావితరాలకు చాటిచెప్పే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఇందులో ప్రధానంగా మూడు విభాగాలు ఉన్నాయి.
● మొదటి విభాగం: అమరవీరుల విగ్రహాలు, వారు వాడిన ఆయుధాల ప్రదర్శన కోసం నాలుగు బ్లాకులు.
● రెండవ విభాగం: టికెట్ కౌంటర్, ఓపెన్ థియేటర్, రెస్టారెంట్లు, దుకాణ సముదాయాలు.
● మూడవ విభాగం: ల్యాండ్ లెవలింగ్, సిమెంట్ రోడ్లు, ప్రహరీ తదితర మౌలిక సదుపాయాలు.
ప్రస్తుత స్థితి..
ప్రస్తుతం మొదటి రెండు విభాగాలకు సంబంధించిన పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఇప్పటివరకు కేంద్రం నుంచి రూ.10 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వర్షాకాలం కంటే ముందే పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉండటంతో, వచ్చే పర్యాటక సీజన్ నాటికి ఈ మ్యూజియం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు.ఇది అందుబాటులోకి వస్తే, కేవలం సీజన్‌లోనే కాకుండా ఏడాది పొడవునా పర్యాటకుల రద్దీ ఉంటుందని, తద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు.
శరవేగంగా పూర్తిచేస్తాం
ఈ ఏడాది పర్యాటక సీజన్ నాటికి అన్ని సౌకర్యాలతో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన అన్ని నిర్మాణ పనులను శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
– యాద కిషోర్, జేఈ,
గిరిజన సంక్షేమశాఖ, చింతపల్లి
వేగవంతం చేయాలి
తాజంగిలో నిర్మిస్తు న్న స్వాతంత్య్ర సమరయోధుల గిరిజన మ్యూజి యం నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. ఇది అందుబాటులోకి వస్తే ఎంతో మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలి.
– కోరాబు అనూషదేవి,
ఎంపీపీ, చింతపల్లి


