ప్రాణాపాయ స్థితిలోనూ మొండితనం | - | Sakshi
Sakshi News home page

ప్రాణాపాయ స్థితిలోనూ మొండితనం

Mar 21 2026 5:07 AM | Updated on Mar 21 2026 5:07 AM

సీలేరు: మారుమూల గిరిజన ప్రాంతాల్లో మూఢనమ్మకాలు, ఆసుపత్రుల పట్ల భయం నేటికీ గిరిజనుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ, మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు వెళ్లబోమని ఓ గిరిజన కుటుంబం మొండికేసిన ఘటన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెలుగుచూసింది.

అసలేం జరిగింది?

గూడెం కొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ రష్యాగూడ గ్రామానికి చెందిన పాంగి కుసుల అనే మహిళ ప్రసవ వేదనతో బుధవారం సీలేరు ఆసుపత్రిలో చేరింది. అదే రోజు ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ,బిడ్డ క్షేమంగానే ఉన్నప్పటికీ, వైద్య పరీక్షల్లో తల్లికి హిమోగ్లోబిన్‌ శాతం కేవలం 4.5 మాత్రమే ఉన్నట్లు తేలింది. రక్తహీనత తీవ్రంగా ఉండటంతో ప్రాణాపాయం పొంచి ఉందని గుర్తించిన స్టాఫ్‌ నర్స్‌ హైమ, మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కి వెళ్లాలని సూచించారు.

వైద్య సిబ్బందితో వాగ్వాదం

విశాఖ వెళ్లాలని సూచించినప్పటి నుంచి బాలింత భర్త గోపాలరావు వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మేము ఎక్కడికీ వెళ్లం, మా ఇంటికి మేము వెళ్ళిపోతాం’ అంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. బాధితురాలి రక్త గ్రూపు ఏబీ పాజిటివ్‌ కావడంతో, ఆ రక్తం చింతపల్లి లేదా నర్సీపట్నంలో దొరకదని, కేజీహెచ్‌లోనే అందుబాటులో ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

బాధ్యత మాదేనని లేఖ..

మూడు రోజుల పాటు పోలీసులు, వైద్య సిబ్బంది కౌన్సిలింగ్‌ ఇచ్చినా ఆ కుటుంబం ససేమిరా అంది. చివరికి ‘నా భార్య బిడ్డలకు ఏమైనా జరిగితే నాదే బాధ్యత, వైద్య సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదు’ అని బాలింత భర్త గోపాలరావు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి తన భార్యను ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

రక్తహీనతతో బాధపడుతున్న బాలింత

కేజీహెచ్‌కు వెళ్లాలని సూచించినా

పట్టించుకోని వైనం

వైద్యసిబ్బందితో వాగ్వాదం

కౌన్సెలింగ్‌ చేసినా ప్రయోజనం శూన్యం

భార్య, బిడ్డకు ఏమైనా తమదే బాధ్యత అంటూ లేఖ రాసిచ్చిన భర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement