● ఇద్దరి అరెస్టు
పాడేరు: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పాడేరు డీఎస్పీ అభిషేక్ తెలిపారు. శుక్రవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ కార్యక్రమంలో భాగంగా గంజాయి రవాణాను శాశ్వతంగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.దీనిలో భాగంగా గురువారం సాయంత్రం ముంచంగిపుట్టు ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి లబ్బూరు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారని తెలిపారు. ఈ సమయంలో బైక్‌పై వచ్చిన నర్సింగ్ అనే వ్యక్తి పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా, సిబ్బంది అతడిని చాకచక్యంగా పట్టుకున్నారన్నారు.అతను ఇచ్చిన సమాచారంతో జోలాపుట్టు సమీపంలో భీమా అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి 50 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించినట్టు ఆయన పేర్కొన్నారు.
సరిహద్దుల్లో కఠిన చర్యలు
ఒడిశాలోని పనసపుట్టు, జనభ, జంత్రి, తాబేరు ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి, జోలాపుట్టు కేంద్రంగా రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలిందని డీఎస్పీ వివరించారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు గానీ, నిల్వలు గానీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఒడిశా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దుల్లో గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జి.మాడుగుల, పాడేరు సీఐలు శ్రీనివాసరావు, దీనబంధు పాల్గొన్నారు.


