అంబులెన్సు సేవల కల్పనలో నిర్లక్ష్యం
సాక్షి,పాడేరు: జిల్లాలోని గిరిజనులకు సకాలంలో వైద్యం అందించేందుకు సంబంధించి అంబులెన్స్‌ల సేవలు కల్పించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం దారుణమని అరకు ఎంపీ, దిశ కమిటీ చైర్‌పర్స్‌న్ డాక్టర్ గుమ్మా తనూజరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం ఆమె అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ( దిశ కమిటీ) సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాఖల వారీగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజేస్తున్న సంక్షేమ పథకాలు,గిరిజనుల సమస్యలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అన్ని విభాగాలకు సంబంధించి 229 అంబులెన్స్‌లు ఉన్నట్టు రికార్డుల్లో ఉన్నా 50శాతం అంబులెన్స్‌లు కూడా సక్రమంగా సేవలు అందించక పోవడం రోగులకు ఇబ్బందిగా మారిందన్నారు. పాడేరు ఐటీడీఏ గ్యారేజీలో 14 అంబులెన్స్‌లు మరమ్మతులతో మూలకు చేరాయన్నారు. వీటి మరమ్మతులకు రూ.5 లక్షలు కూడా ఐటీడీఏ ఖర్చుపెట్టకపోవడం దారుణమన్నారు. అంబులెన్సుల మరమ్మతులకు ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. జిల్లాలో అంబులెన్స్‌ల మెయింటెనెన్స్‌కు వస్తున్న నిధుల సమగ్ర వివరాలను వెంటనే తనకు అందజేయాలని ఆదేశించారు. అంబులెన్స్ సేవలు సకాలంలో అందించకపోవడంతో కూడా కుమారి అనే గిరిజన మహిళ ప్రాణాలను కాపాడుకోలేక పోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల్లో జిల్లాలోని అన్ని అంబులెన్స్‌లను వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు. గిరిజన విద్యాలయాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని, ప్రతి ఆరునెలలకు ఓ సారి ప్రతి విద్యార్థికి సమగ్రమైన స్క్రీనింగ్ పరీక్షలు జరపాలన్నారు.నాణ్యమైన ఆహారం విద్యార్థులకు పంపిణీ చేయాలన్నారు. అనారోగ్యంతో గిరిజన విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు. జిల్లాలో అన్ని అభివృద్ధి పథకాలు సమర్థ్ధవంతంగా అమలుజేయాలని, ఎంపీ ల్యాడ్స్ నిధుల పనుల వేగవంతం చేయాలన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాలు, రోడ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం తగదన్నారు. గ్రామసచివాలయాల ఉద్యోగులు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయని, పనితీరు మెరుగు పరుచుకో వాలని సూచించారు.కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టబోయే పనులను ఎంపీతో పాటు ప్రజాప్రతినిధులకు నివేదించాలన్నారు. అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల పనులు, సెల్‌టవర్లు,గృహనిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ జిల్లాలో రోడ్ల పనులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించి, నాణ్యతగా నిర్మించాలన్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో ఇన్‌చార్జి జేసీ.ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ,అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి పాల్గొన్నారు.
అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి ఆగ్రహం
గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై
దృష్టి పెట్టాలని సూచన
కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమావేశం


