గిరిజన రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
సెంట్రల్ నోడల్ ఆఫీసర్ అమిత్ సింగ్లా
చింతపల్లి: ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటూ గిరిజన రైతులు ఆర్థికంగా ఎదగాలని సెంట్రల్ నోడల్ ఆఫీసర్(పీఎండీడీకైవె) అమిత్ సింగ్లా కోరారు. బుధవారం ఆయన లంబసింగి, తాజంగి, రాజుపాకల ప్రాంతాల్లో విస్త ృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తాజంగి గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 700 ఎకరాల్లో సాగు చేపట్టిన వేరుశనగ క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన చేతుల మీదుగా రైతులకు మినుము, వేరుశనగ విత్తనాలు, సైకిల్ వీడర్స్, వేప నూనె పంపిణీ చేశారు. రాజుపాకలలోని లంబసింగి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ గ్రూప్‌ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సోలార్ డ్రైయిర్, కోల్డ్‌స్టోరేజ్ యూనిట్లను పరిశీలించారు. ఐడీడీఏ, హార్టికల్చర్ శాఖల రాయితీతో నడుస్తున్న చెక్కీలు, పచ్చళ్లు, చిప్స్ తయారీ కేంద్రాల నిర్వాహకులను అభినందించారు. గిరిజన ఉత్పత్తులకు సరైన వేదిక కల్పించడం ద్వారా రైతులకు మంచి లాభాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. రైతుల పురోగతి పట్ల సంతృప్తి వ్యకం చేసిన ఆయన, క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం రైతులకు అండగా ఉంటూ వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, పశుసంవర్థకశాఖ, లీడ్ బ్యాంక్ మేనేజర్, జిల్లాకు సంబంధించిన వ్యవసాయ ఇతర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


