విద్యుత్ ఉత్పత్తికి పుష్కలంగా నీటి నిల్వలు
సీలేరు: వేసవిలో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సీలేరు కాంప్లెక్స్‌లోని జలాశయాల్లో నీటినిల్వలు పుష్కలంగా ఉన్నాయని సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీరు రాజారావు తెలిపారు. బుధవారం ఆయన వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జలాశయాల్లో 70 టీఎంసీల నిల్వలు ఉన్నాయన్నారు. డొంకరాయి మినహా, మాచ్‌ఖండ్, పొల్లూరు, సీలేరులో యూనిట్లు నిర్మించి 50 ఏళ్లు దాటినా సామర్థ్యానికి మించి ఉత్పాదన జరుగుతోందన్నారు. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో ఐదు, ఆరు యూనిట్ల నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని, జూలై నాటికి ఉత్పత్తి ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో మరమ్మతులు, విడిభాగాల తొలగింపు పనులు పూర్తయ్యయన్నారు. రూ.1.5 కోట్లతో చేపట్టిన డొంకరాయి పవర్ కెనాల్ పనులు పూర్తయినట్టు ఆయన తెలిపారు. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో గేట్ల పనులు పూర్తయిన వెంటనే పవర్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. సీలేరు విద్యుత్ కాంప్లెక్సులో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ నిర్మాణానికి స్టేజ్‌వన్ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించి సర్వే తహసీల్దార్ పూర్తిచేసిన వెంటనే మరోసారి జేసీ పరిశీలిస్తారన్నారు. ఎస్‌ఈ జాకీర్ హుస్సేన్, ఇన్‌చార్జి ఈఈ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
సీలేరు విద్యుత్ కాంప్లెక్స్
చీఫ్ ఇంజినీరు రాజారావు


