500 కిలోల గంజాయి పట్టివేత
● విలువ రూ.25 లక్షలు
● ఇద్దరు ఒడిశా స్మగ్లర్ల అరెస్టు,
రిమాండ్‌కు తరలింపు
● వ్యాన్, బైక్ సీజ్
ముంచంగిపుట్టు: ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న ఐదు వందల కిలోల గంజాయిని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు జంక్షన్ వద్ద బుధవారం ఉదయం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ నాని తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో లబ్బూరు జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టామన్నారు. అదే సమయంలో ఒడిశా వైపు వచ్చిన బోలెరో వాహనం, బైక్‌తో వచ్చిన వ్యక్తులు తమ సిబ్బందిని చూసి పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. దీంతో చాకచక్యంగా వ్యవహరించి, వారిలో ఇద్దరిని పట్టుకోగా, ముగ్గురు వ్యక్తులు పరారీ అయ్యారన్నారు. బోలెరో వాహనంలో గంజాయి బస్తాలను గుర్తించామన్నారు. వీటికి రెవెన్యూ అధికారుల సమక్షంలో తూకంగా వేయగా ఐదువందల కిలోలు బరువు ఉందన్నారు. దీనివిలువ రూ.25 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. పట్టుబడిన నిందితులు ఒడిశా రాష్ట్రం కోరాపుట్టు జిల్లా కేంద్రానికి చెందిన సుభాష్,ఖేముడు, పురంద్రగా గుర్తించామన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. పరారీలో ఉన్న ముగ్గురికోసం గాలింపు చేపట్టామని, బొలెరో వాహనం, బైక్‌ను సీజ్ చేశామని చెప్పారు. ఏఎస్‌ఐ లక్ష్మణరావు, సిబ్బంది శ్రావణ్, రవి, మూర్తి పాల్గొన్నారు.


