ఫిబ్రవరి 18న ఫ్లీట్‌ రివ్యూ | - | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 18న ఫ్లీట్‌ రివ్యూ

Jan 22 2026 7:08 AM | Updated on Jan 22 2026 7:08 AM

ఫిబ్రవరి 18న ఫ్లీట్‌ రివ్యూ

ఫిబ్రవరి 18న ఫ్లీట్‌ రివ్యూ

● 19న సిటీ పరేడ్‌ ● హాజరుకానున్న రాష్ట్రపతి, సీఎం.. ● 22 దేశాల నుంచి రానున్న నౌకలు

మహారాణిపేట: విశాఖ వేదికగా ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ(ఐఎఫ్‌ఆర్‌)–2026, మిలాన్‌ విలేజ్‌ కార్యక్రమాలు, భారత రాష్ట్రపతి పర్యటనను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా యంత్రాంగం, నేవీ, పోలీసు, రక్షణ శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌, వైద్య సేవలు, అగ్నిమాపక భద్రత, పీఏ సిస్టమ్‌, బ్యారికేడింగ్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థ, కాన్వాయ్‌ నిర్వహణ, తాగునీరు, ప్రజల రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సాంస్కృతిక, జానపద నృత్య బృందాల ప్రదర్శనలు, మార్చింగ్‌ కంటింజెంట్‌ నిర్వహణ ప్రణాళికాబద్ధంగా ఉండాలని సూచించారు. మిలాన్‌ విలేజ్‌, క్రూయిజ్‌ టెర్మినల్‌ ప్రాంతాల్లో స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌–2026 సందర్భంగా నగరంలోని పార్కులు, ప్రధాన రహదారుల్లో సుందరీకరణ పనులు చేపట్టాలని, ఏవైనా అసంపూర్తిగా ఉన్న సివిల్‌ వర్క్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను నేవీ కమోడర్లు అమీ మాథ్యూ, రజనీష్‌ శర్మ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ వేడుకలకు విదేశాల నుంచి 73 మంది అతిథులు, 22 దేశాల నౌకలు హాజరవుతున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 15–20 వరకు మిలాన్‌ విలేజ్‌ కార్యక్రమాలు, 18న రాష్ట్రపతి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ, 19న రక్షణ శాఖ మంత్రి, సీఎం చంద్రబాబు ముఖ్య అతిథులుగా ఇంటర్నేషనల్‌ సి టీ పరేడ్‌, మిలాన్‌ ప్రారంభోత్సవం, 19, 20న మి లాన్‌ హార్బర్‌ ఫేజ్‌, 21–25 వరకు సీ ఫేజ్‌ ఉంటుందని వివరించారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, వీఎంఆర్డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌, జేసీ విద్యాధరి, డీసీపీ మణికంఠ చందోలు, ఆర్డీ వోలు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement