బైక్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు
ఘటనా స్థలంలో వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: మండలంలోని లైనుకొత్తూరు పంచాయతీ సోమన్నపాలెం వద్ద పాత జాతీయ రహదారిపై బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బైక్‌ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పులపర్తి నుంచి ఓ బస్సు మహిళా ఉద్యోగులతో అచ్యుతాపురం బ్రాండిక్స్ పరిశ్రమకు వెళ్తుండగా.. యలమంచిలి మండలం సోమన్నపాలెం వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న గింజల తాతబ్బాయి అక్కడికక్కడే దుర్మరణం పొందాడు. మృతుడు అచ్యుతాపురం సెజ్ యొకోహోమా టైర్ల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని యలమంచిలి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ప్రమాదం కారణంగా పాత జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర ప్రమాద సమాచారం తెలుసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


