స్కూటీని ఢీకొన్న ట్రాక్టర్... వ్యక్తి మృతి
అచ్యుతాపురం రూరల్: స్కూటీపై వెళ్తున్న ఎడ్ల సన్యాసినాయుడు (47) అనే వ్యక్తిని వెనుక నుంచి ఇటుక లోడ్ ఉన్న ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన హరిపాలెం వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి. సన్యాసినాయుడు రాంబిల్లి ఎన్‌ఏఓబీ లో టెలిఫోన్ ఆపరేటర్‌గా పనిచేస్తూ, కొండకర్ల హనీ గ్రూప్ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో నివాసముంటున్నారు. ఉదయం తన ఇద్దరు పిల్లలను తిమ్మరాజుపేటలో డావిన్సీ స్కూల్లో దించి తిరిగి వస్తుండగా హరిపాలెం జెడ్పీ హైస్కూల్ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి ఇటుకుల లోడ్ ఉన్న ట్రాక్టర్ కొనడంతో అతను సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మృతునికి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. కల్లా కపటం తెలియని పసిపిల్లలు తన తండ్రి ఇక తిరిగి రాడన్న చేదు నిజం తెలిసే సరికి గుండెలు అవిసేలా ఏడుస్తుండడం స్థానికులను కంటతడి పెట్టించింది. అనుకోని ప్రమాదంతో పండంటి కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడిందని కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.


