జైళ్ల నిర్వహణలో సాంకేతికత కీలకం
సీపీ శంఖబ్రత బాగ్చి
ఆరిలోవ: జైళ్ల నిర్వహణలో ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారంలో భారత ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ ఆధ్వర్యంలో జైళ్ల సుపరిపాలనలో సాంకేతికత అనే అంశంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. జైళ్ల భద్రత, పరిపాలన, ఖైదీల పునరావాసంలో సాంకేతికత ప్రాధాన్యం ఎంతో ఉందన్నారు. జైళ్లకు పటిష్టమైన భద్రత అవసరమని, అందుకు ఆధునిక విధానాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ మూడు రోజుల శిక్షణలో ప్రధానంగా ఈ–ప్రిజన్స్, డిజిటల్ రికార్డుల నిర్వహణ, వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థలు, భద్రతా పర్యవేక్షణ, ఖైదీల నిర్వహణ సాఫ్ట్‌వేర్ తదితర అంశాలపై అధికారులకు అవగాహన కల్పిస్తారు. కార్యక్రమంలో విశాఖ కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎం.మహేష్‌బాబు, ఇతర జైళ్ల అధికారులు, జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


