‘ఎంపీల్లారా.. కేకే లైన్ కోసం పోరాడండి’
అల్లిపురం: కొత్తవలస–కిరండూల్ (కేకే) లైన్‌ను విశాఖ రైల్వే డివిజన్‌లోనే కొనసాగించాలని, ఇందుకోసం ఉత్తరాంధ్ర ఎంపీలు కృషి చేయాలని రైల్వే జోన్ సాధన సమితి సభ్యుడు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం.పైడిరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం దశాబ్దకాలం పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు కలిసి రైల్వే జోన్ సాధన సమితిగా ఏర్పడి, పోరాడి సాధించుకున్నామని ఆయన గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం రైల్వే బోర్డు ఖరారు చేసిన విశాఖ రైల్వే డివిజన్ స్వరూపంలో.. కీలకమైన కేకే లైన్‌ను మినహాయించడం ఈ ప్రాంతానికి తీరని అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయం వచ్చే ప్రాంతాలను, కేకే లైన్‌ను విశాఖ నుంచి విడదీసి రాయగడ డివిజన్‌లో కలపడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.


