లింగంపేట కార్యదర్శి ఏకపక్ష నిర్ణయంపై ఫిర్యాదు
నాతవరం: గ్రామసభ పెట్టకుండా, సర్పంచ్‌కు తెలియకుండా కూటమి నాయకులు చెప్పినట్లుగా తప్పుడు పంచాయతీ తీర్మానం చేసిన కార్యదర్శి బుచ్చియ్యపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత, లింగంపేట సర్పంచ్ లోకవరపు రాము ఎంపీడీవో శ్రీనివాస్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. అనంతరం సర్పంచ్ విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రామం మొదట్లో మన్యపురట్ల పంచాయతీ పరిధిలో ఉండేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అప్పటి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ కృషితో లింగంపేట పంచాయతీగా ఏర్పాటైందన్నారు. నూతన పంచాయతీకి భవనం లేక అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. దీంతో ప్రభుత్వం పంచాయతీ భవనం నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేసిందన్నారు. భవన నిర్మాణం చేసేందుకు స్థలం చూపించాలని అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. స్థలం కేటాయించేందుకు గ్రామసభ ఏర్పాటు చేయాలని కార్యదర్శి బుచ్చియ్యను పలుమార్లు కోరినట్టు చెప్పారు. గ్రామసభలో అందరి అంగీకారంతో పంచాయతీ భవనం కోసం స్ధలం కేటాయించుదామని చెప్పామన్నారు. పంచాయతీ కార్యదర్శి తమ మాటలు వినకుండా కూటమి నాయకులు చెప్పిన విధంగా వ్యవహరించారని ఆరోపించారు. కూటమి నాయకులతో పంచాయతీ కార్యదర్శి కుమ్మకై తప్పుడు సంతకాలతో గ్రామం మధ్యలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్త స్థలంలో భవనం నిర్మాణం చేసేందుకు తీర్మానించారన్నారు. ఈ పనులపై పంచాయతీలో వివాదం జరుగుతుందన్నారు. భవన నిర్మాణం కోసం గ్రామంలో రోడ్లు ఆనుకుని అనేక చోట్ల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందన్నారు. అక్కడ నిర్మిస్తే బాగుంటుందని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి వ్యవహారంపై ఎంపీడీవో, కలెక్టరుకు ఫిర్యాదు చేశామని సర్పంచ్ రాము, వార్డు సభ్యులు తెలిపారు.


