నకిలీ పత్రాలతో రూ.4 కోట్లు స్వాహా
ఎంవీపీకాలనీ: భూ లావాదేవీలకు సంబంధించిన కేసులో ఎంవీపీ పోలీసులు ఎట్టకేలకు నిందితుడు చిటికెల గోవింద్‌ను అరెస్ట్ చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ రాధాకృష్ణ.. వ్యాపార రీత్యా గతంలో విశాఖలో ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో మధురవాడకు చెందిన చిటికెల గోవింద్.. రాధాకృష్ణ వద్ద పనిలో చేరాడు. యజమానికి తెలియకుండా గోవింద్ పలు భూ లావాదేవీల్లో ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాడు. నకిలీ పత్రాలు సృష్టించి, రాధాకృష్ణకు సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను సైతం డ్రా చేసి సుమారు రూ.4 కోట్ల వరకు కాజేశాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన రాధాకృష్ణ, ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. గత ఏడాదిన్నరగా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. గోవింద్ చేసిన మోసం కారణంగా తీవ్ర మనోవేదనకు గురై తన తండ్రి మరణించారని, కేసు నమోదు చేసి ఏడాదిన్నర గడుస్తున్నా నిందితుడిని అరెస్ట్ చేయలేదని విదేశాల్లో ఉంటున్న రాధాకృష్ణ కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె డీజీపీకి లేఖ రాస్తూ.. దర్యాప్తులో పురోగతి లేకపోవడాన్ని ప్రశ్నించారు. తక్షణం గోవింద్‌ను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ లేఖతో పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో నగర పోలీసు కమిషనర్ సీరియస్‌గా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు ఎంవీపీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బుధవారం పలు పోలీసు బృందాలతో గాలించి గోవింద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎంవీపీ సీఐ ప్రసాద్ తెలిపారు. అనంతరం నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, కోర్టు అతనికి రిమాండ్ విధించింది. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి రాధాకృష్ణ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు.
మాజీ ప్రొఫెసర్‌ను మోసగించిన కేసులో గోవింద్ అరెస్ట్


