గూడ్స్ రైలు ఢీకొని విలేకరి దుర్మరణం
గోపాలపట్నం: రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు ఢీకొని స్థానిక విలేకరి మృతి చెందారు. నార్త్ సింహాచలం రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మృతుడిని కొత్తపాలెం నివాసి నేమాని సాయి కృష్ణ(45)గా గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. సాయి కృష్ణ ఉదయం 10.30 నుంచి 11 గంటల సమయంలో నార్త్ సింహాచలం వద్ద రైలు ట్రాక్ దాటుతుండగా, అటుగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సాయి కృష్ణ ఓ స్థానిక పత్రికలో గోపాలపట్నం విలేకరిగా పని చేస్తున్నారు. జర్నలిజంతో పాటు, స్థానికంగా ఓ మెడికల్ షాపులో పని చేస్తూ ఆర్‌ఎంపీగా శిక్షణ పొందారు. అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా ఎవరికి అనారోగ్య సమస్య వచ్చినా వెళ్లి వైద్యం చేసేవారని, హస్తవాసి మంచిదని స్థానికుల్లో సాయికృష్ణకు మంచి పేరుంది. సాయి కృష్ణ తండ్రి కొన్ని నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే, ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా మృతి చెందడంతో అతని తల్లి ఒంటరివారయ్యారు. అందించిన సమాచారం మేరకు జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం గురువారం దహన సంస్కారాలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయి కృష్ణ ఆకస్మిక మృతి పట్ల సింహాద్రి జర్నలిస్టు సొసైటీతో పాటు పలువురు విలేకరులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.


