ఇచ్చిన హామీ నెరవేర్చాలి
పాడేరు : ఎన్నికల సమయంలో గ్రామ వలంటీర్లకు ఇచ్చిన హమీలను కూటమి ప్రభుత్వం అమలు చేసి న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. వలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆద్వర్యంలో ఐటీడీఏ ఎదుట రణభేరి రిలే నిరహర దీక్షలను ఆయన ప్రారంభించారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రూ.10వేలు వేతనం ఇచ్చి విధుల్లోకి తీసుకుంటామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయన్నారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్లను పూర్తిగా విస్మరించి విధులు అప్పగించకుండా మోసం చేసిందన్నారు. రణభేరి దీక్షలను ఈనెల 7వరకు నిర్వహిస్తామన్నారు. అదేరోజు జిల్లా కేంద్రమైన పాడేరులో వేలాది మంది గ్రామ వలంటీర్లతో భారీ ప్రదర్శన చేపడుతామన్నారు. అప్పటికి సమస్యపై స్పష్టమైన హామీ రాకపోతే రాజధాని కేంద్రంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. గ్రామ వలంటీర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్. సుంద్‌రావు, గిరిజన సంఘం మండల కార్యదర్శి చిట్టిబాబు పాల్గొన్నారు.


